Maha Shivaratri : మహా శివరాత్రిని భక్తులంతా ఘనంగా జరుపుకుంటారు. నియమ నిష్టలతో పూజలు చేస్తారు. ఈ రోజు పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెప్తునాయి. భక్తులు ఉదయాన్నే తలస్నానం చేసి, ఆలయాలకు వెళ్లి పూజలు చేసి, శివుని నామస్మరణలో మునిగి తేలుతారు. శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయడం అత్యంత పవిత్రమైనది. అందు వలనే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటున్నాం. ఉపవాసం చేసి శివ జాగారణతో భక్తులు శివారాధన చేస్తారు. భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు. అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారో తెలుసా? పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి ప్రత్యేక కారణాలున్నాయి. అవేంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది చదవండి….
క్షీరసాగర మథనం
పురాణ కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం చేశారు. ఈ క్షీరసాగర మథనంలో మొదట వచ్చిన గరళాన్ని శివుడు స్వీకరించాడు. విషం తీసుకున్న శివుడు ఆ రాత్రి పడుకుంటే విషం శరీరం అంతా వ్యాపించే ప్రమాదం ఉంది. అందుకే శివునికి నిద్ర రాకుండా దేవతలు, అసురులు అందరు కలిసి ఐదు జాముల పాటు జాగారం చేసి ఆడిపాడారు.
అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు ఆడిపాడిన ఐదు జాముల సమయానే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాం. ఆ రోజు ఉపవాసం, జాగారణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరళాన్ని కంఠంలోనే దాచుకోవడం వలనే శివుడిని నీలకంఠుడు అని పిలిస్తారు.
ఒక సారి బ్రహ్మ, విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని గొడవ పడుతుంటారు. వారి గొడవను తీర్చడానికే శివుడు లింగాకారమై మళ్లీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడు లింగాకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం.
లింగోద్భావం
ఒక సారి బ్రహ్మ, విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అని గొడవ పడుతుంటారు. బ్రహ్మ సకల జనుల తలరాతలు రాసేది నేను, సృష్టించేది నేను, కాబట్టి నేనే గొప్ప అని అంటుంటే… కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాలన్ని తిరిగి రకరకాల అవతారాలలో పర్వవేక్షిస్తూ పాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అంటాడు విష్ణువు. వీరి ఇద్దరి మధ్య గొడవ ఎంతకీ తగ్గకపోవడంతో వీరి తగువున్ను తీర్చడానికి స్వయంగా మహాశివుడే అక్కడికి వచ్చాడు. శివుడు ఇద్దరితో అగ్ని స్తంభంని చూపించి, దాని ఆది అంతములు ఎవరు కనుక్కుంటే వారే గొప్ప అని చెప్తాడు.
ఆద్యంతాలు తెలుసుకోండి
అగ్ని స్తంభం ఆది మరియు అంతములు తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువులు బయలుదేరుతారు. బ్రహ్మ హంస వాహనంపై అగ్ని స్తంభం ఆదిని, విష్ణువు వరాహ రూపంలో అగ్ని స్తంభం అంతము తెలుసుకోవడానికి బయలుదేరుతారు. ఎంత ప్రయత్నించినా బ్రహ్మ, విష్ణువులకు అగ్ని స్తంభం యొక్క ఆద్యంతాలు తెలుసుకోలేక పోతారు. విష్ణువు ఓటమిని అంగీకరిస్తాడు, బ్రహ్మ కామధేనువును, మొగలిపువ్వును ఆది చూసినట్లుగా అబద్దం చెప్పమంటాడు. శివుడు బ్రహ్మతో పాటు అబద్దం చెప్పిన కామధేనువుకు, మొగలిపువ్వుకు శాపం ఇస్తాడు. తర్వాత అగ్ని స్తంభం తానేనని దానికి ఆద్యంతాలు లేవని చెప్తాడు శివుడు.
దీని ద్వారా తమ కంటే శివుడే గొప్పవాడని బ్రహ్మ, విష్ణువు గ్రహించి లింగాకారంలో ఉన్న మహాశివుడిని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి, మారేడు దళాలతో అర్చించారు. మహా శివుడు లింగరూపంలో మాఘమాసం ఆరుద్రనక్షత్రం నాడు ఉద్బవించిన పర్వదినం రోజునే మహాశివరాత్రి.
నాటి నుంచి ప్రతి మాఘమాసం రోజున మహాశివరాత్రి పర్వదినంగా ఆచరిస్తున్నారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి, శివలింగానికి రుద్రాభిషేకం చేసి, జాగారం చేస్తే అంతా మంచే జరుగుతుందని భక్తుల విశ్వాసం.
పూజ సమయం
మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 18 శనివారం జరుపుకుంటారు. ఫాల్గుణమాసములోని చతుర్దశి తిథి ఫిబ్రవరి 17 రాత్రి 8:02 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 18 సాయంత్రం 4:18 గంటలకు ముగుస్తుంది. పారణ సమయం ఫిబ్రవరి 19వ తేది ఉదయం 06:57 నుండి మధ్యాహ్నం 3:33 గంటల వరకు.
పూజా విధానం
ఈ రోజు తెల్లవారుజామున నిద్ర లేచి తలస్నానం చేయాలి. అనంతరం ఉపవాస నిమమాల్ని పాటిస్తూ శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయాలి. అనంతరం బిల్వపత్రాలను సమర్పించాలి. అభిషేకం చేసిన తర్వాత “ఓం నమః శివాయ” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఈ విధంగా రోజంతా శివారాధనలో శివునికి దగ్గరగా ఉండాలి. రాత్రి అంతా జాగరణ చేసి మరునాడు భోజనం చేసి ఉపవాస దీక్ష విరమించాలి. మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే రెట్టింపు శుభ ఫలితాలు కలుగుతాయి. పేదలకు దానం చేయడం వలన మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి సుఖసంతోషాలు, అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.
చేయాల్సిన పనులు
శివరాత్రి రోజున తప్పకుండా శివాలయానికి వెళ్లాలి . ఓం నమఃశివాయ అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి. శివుడికి సమర్పించే నైవేద్యంలో పులిహోర ఉండేలా చూడాలి. శివ లింగానికి పంచామృతాన్ని సమర్పించాలి. ఉపవాసం ఉండేవారు కేవలం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. మారేడు ఆకులతో శివుడిని పూజించాలి. శివాలయానికి వెళ్లే పురుషులు చొక్కాలు ధరించి వెళ్ళకూడదు.
చేయకూడని పనులు
ప్యాకెట్ పాలతో శివుడిని అభిషేకించకూడదు. ఆవు పాలను మాత్రమే ఉపయోగించాలి. శివునికి అభిషేకం చేసేటప్పుడు మాట్లాడకూడదు. అభిషేక సమయంలో స్త్రీలు లింగాన్ని తాకకూడదు. అలాగే శరీరం నుంచి వచ్చే చెమట, వెంట్రుకలు శివలింగంపై పడకూడదు. శివరాత్రి రోజున మద్యం, మాంసం తినకూడదు. చిన్న చీమకు కూడా హాని చేయకూడదు. అసభ్య పదాలను మాట్లాడకూడదు. ఇతరుల గురించి చెడుగా ఆలోచించకూడదు.