Shivaratri Abhishekam:
మాములుగా పండగలు అన్ని పగటి పూట జరుపుకుంటే శివరాత్రి మాత్రం ముఖ్యంగా రాత్రిపూట విశేషంగా నిర్వహిస్తాం. శివరాత్రి రోజు అర్థరాత్రి 12 గంటలకు శివుడు లింగరూపంలో ఉద్భవించిన పర్వదినం. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి, మనస్సును దైవ చింతనలో గడుపుతు రాత్రి సమయంలో నిద్రపోకుండా (జాగరణ) శివుని అనుగ్రహం కోసం మేల్కొని భక్తిశ్రద్దలతో పూజలు, అభిషేకాలు చేస్తారు.
శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన అంశాలు
- అభిషేకం చేయడం
- శివనామస్మరణ
- ఉపవాసం ఉండటం
- రాత్రి జాగరణ చేయడం
- బిల్వదళాలతో అర్చన
శివరాత్రి రోజు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రపరచుకుని శుచిగా తలస్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. గడపలకు తోరణాలు, పూలు కట్టాలి. ముందుగా ఒక చిన్న శివలింగం అంటే అంగుష్టమాత్రం పరిమాణం శ్రేష్టం. అంటే మన బొటనవేలు సైజు మించరాదు.
Shivaratri Abhishekam
అభిషేకం ఇచ్చే ఫలితాలు మాటలో చెప్పలేము. శివుడు అభిషేక ప్రియుడు, శివుడికి కాసిన్ని నీళ్లు పోసిన సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రినాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల, మత భేదం లేకుండా శివుడిని అర్చించడం, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
అభిషేకం చేసే విధానం
శివునికి శుద్ధ జలంతో, ఆవుపాలతో, పంచామృతంతో, పుష్పాలతో అభిషేకించాలి, ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తుమ్మిపూలను, తెల్లని పూలతో శివనామాలను కాని పంచాక్షరీ మంత్రమైన ఓం నమః శివాయ అని స్మరింస్తూ పూజించాలి. అభిషేకం చేసేటప్పుడు వేదం వచ్చినవారు వేదం పఠిస్తూ చేయచ్చు. వేదం రానివారు సురరయమహర్షి రుద్ర మంత్రాలను 15 శ్లోకాల రూపంలో అందిచాడు. ఈ శ్లోకాలను చదువుతూ అభిషేకం చేయవచ్చు. అభిషేకం సాయంత్రం 6 నుండి పక్క రోజు 6 గంటల వరకు చేయవచ్చు. ముఖ్యంగా అర్థరాత్రి 12 గంటలకు లింగోద్భవ సమయంలో చేస్తే అపారమైన ఫలితం కలుగుతుంది. 11 సార్లు లేదా 5 సార్లు అభిషేకం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
ఉపవాసం
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధ్యాన్యం ఉంది. ఉపవాసం ఉండే ముందు రోజు మరియు మరుసటి రోజు మాంసాహారం, గుడ్లు, చేపలు వంటివి తినకూడదు. మద్యపానం చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. శివరాత్రి రోజు నేను శివునికి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా ఉంచడమే ఉపవాసం.
బిల్వదళాలతో అర్చన
శివుడిని బిల్వదళాలతో అర్చన చేయడం చాలా మంచిది. ముఖ్యంగా శివరాత్రి రోజు బిల్వదళాలతో అర్చన చేయడం వలన విశేష ఫలితం కలుగుతుంది.
శివనామస్మరణ
శివరాత్రి రోజు తప్పకుండా చేయవలసినది శివనామస్మరణ. శివ పంచాక్షారీ స్తోత్రం లేదా ఓం నమః శివాయ లేదా శివాయ గురవే నమః అని స్మరించాలి. మననం చేసేవారిని కాపాడేది మంత్రం అంటారు కాబట్టి శివున్ని మనస్సులో నిరంతరం మననం చేసుకోవడం వలన అష్టాఐశ్వారాలు, సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి.
జాగరణ
రాత్రి మేల్కొని సినిమాలు చూడటం, ఆటలు ఆడటం, కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తే జాగరణ అవ్వదు. దాని కన్నా నిద్ర పోవడం మంచిది. జాగరణ చేసే వారు శివలీలలు, శివుని ప్రవచనాలు, నాయనారుల చరిత్రలు వింటూ దేవునికి దగ్గరగా ఉండాలి. అంటే కాకుండా శివ నామాలను, శివపురాణం మొదలగునవి చదువుకుంటే విశేష శుభఫలితాలు పొందుతారు.
శివరాత్రికి ఉపవాసం, జాగరణ చేసిన వారు మరుసటి రోజు స్నానం చేసి నైవేద్యంగా అన్నం కూరలు వండి దేవునికి నివేదన చూపించాలి. ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందే ఆవుకు బియ్యం, తోటకూర, బెల్లం కలిపి తినిపించి గోమాతకు మూడు ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత పేద వారికి అంటే ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయాలి, పశు, పక్ష్యాదులకు కూడా తినడానికి మరియు త్రాగడానికి ఏర్పాటు చేయాలి. శివాలయానికి వెళ్లి దర్శనం చేసుకొని, ప్రసాదం స్వీకరించాలి. తర్వాత ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముగించాలి. ముఖ్యంగా శివరాత్రి నాడు జాగరణ చేసిన వారు మరుసటి రోజు రాత్రి వరకు నిద్ర పోకూడదు.
సాక్షాత్తు పరమ శివుడు తన భక్తుల భాదలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే ధానాలను ఏ రూపంలోనైనవచ్చి భిక్షతీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఈ సూక్ష్మమైన విషయాన్ని గ్రహిస్తే దైవాంశ సంభూతులమౌతాము.
పై అన్నింటి కంటే ముఖ్యమైనది అందరిలో పరమేశ్వరుడిని చూడటం. మనం పూజ గదిలో చేసేది థియరీ అయితే మనం ఇంటి బయట చేసేది ప్రాక్టికల్ కాబట్టి ప్రతి ఒక్కరిలో శివుడిని చూడటం ప్రధానం.