Money : ఈ వ్యాసంలో డబ్బుకు ఉన్న విలువను మరియు డబ్బుకు మానవుడు ఇచ్చే గౌరవం ఎలాంటిదో చూద్దాం.
ఎవరు ఎన్ని చెప్పినా… డబ్బు విలువ డబ్బుదే! ‘డబ్బులేని వాడు డుబ్బుకు కొరగాడు’. ‘డబ్బుకు లోకం దాసోహం’ లాంటి సామెతలు చాలా విషయాల్లో నిజమేననిపిస్తుంటాయి. డబ్బుతో కొనలేనివి కొన్ని మాత్రమే ఈ లోకంలో ఉన్నాయి. 1) తల్లిదండ్రులు తమ బిడ్డలపై చూపే ప్రేమ. 2) భార్యాభర్తల నడుమ పెనవేసుకున్న ప్రేమ 3) గాఢ స్నేహితుల మధ్య ఉండే ప్రేమాభిమానం.
అయితే పైన పేర్కొన్న 3 అంశాలు కూడా ఈ మధ్య డబ్బుతో ముడిపడిపోతున్నాయనడం సత్యం. అందువల్లనే మనుషుల్లో ఆత్మసంతృప్తి, ప్రేమానురాగాలు లాంటి లక్షణాలు కొరవడి పోతున్నాయి.
Money
డబ్బు ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బొక బంగారు బాతు. అది గుడ్లు పెడుతూ పోతూనే ఉంటుంది. మీరు ఎన్ని ఉదాహరణలైనా తీసుకొంది. డబ్బు + ఏదైనా అదనపు అర్హతలుంటేనే ఈ ప్రపంచంలో వారు విశిష్ట వ్యక్తులుగా రాణిస్తారు. ఎన్ని విశిష్ట లక్షణాలున్నా Money లేకపోతే ఆ మనిషి సమాజంలో గుర్తింపు పొందడం అసాధ్యం.
ఉదాహరణకు మీరో స్నేహితుని కొడుకు పుట్టినరోజు ఫంక్షన్ కు వెళ్ళారనుకోండి. మీకు మీ స్నేహితుడంటే చాలా అభిమానం. మీరు ఆ ఫంక్షన్ మనవాడిదే కదా (మీ దగ్గరి మిత్రుడి కొడుకుదే కదా) అన్న ధిమాతో గిప్ట్ ఏదీ తీసుకోకుండా వెళ్ళారనుకుందాం. అఫ్ కోర్స్ మీ జేబులో గిప్ట్ తీసుకెళ్ళడానికి సరిపడా డబ్బు కూడా లేదనుకోండి? మీరు అలా ఉత్త చేతులతో వెళ్లి మీ స్నేహితుడి కొడుక్కి కేక్ తినిపించి, అబ్బాయి ముద్దొస్తున్నాడ్రా అంటూ పొగిడి మాట్లాడుతూ ఉండండి. అదే వేరే మిత్రుడెవరైనా ఖరీదైన గిప్ట్ తెచ్చి బాబు చేతిలో ఉంచి బాబు బుగ్గ తట్టి భలే ఉన్నాడండీ బాబు అంటూ కామెంట్ చేశాడనుకోండి. మీరిదే మాట అన్నప్పుడు మీ మిత్రుని రెస్పాన్స్ ఎలా ఉంది ? ఖరీదైన గిప్ట్ తెచ్చిన మిత్రునితో మీ ఫ్రెండ్ ప్రవర్తన ఎలా ఉంది పోల్చి చూడండి. అప్పుడు మీకు అర్ధమైపోతుంది డబ్బు విలువ ఏమిటో!
మరో ఉదాహరణగా… భార్యాభర్తల మధ్య ప్రేమ మాటాల్లో, చేతల్లో అనుక్షణం వ్యక్తం చేసుకుంటూ ఉన్నవారే నిజంగా ప్రేమించుకుంటున్నట్లు. అలాకాక సాటివారితో పోల్చి అదీ డబ్బుతో వారికీ తనకూ మధ్య వ్యత్యాసాన్ని పోల్చి మాట్లాడుకుంటున్నారంటే వారి సంసారంలో యాంత్రికత చోటు చేసుకున్నట్లే!
ఇప్పుడు మరో ఉదాహరణగా… చూడండి తక్కువ జీతం పొందే ఓ భర్త తమ పెళ్ళిరోజున తన భార్యకు ఓ మామూలు ధర చీర కొని తెచ్చాడనుకోండి. నిజానికి అతను తన భార్యకు నప్పే కలర్, చీర అంచు అవీ… అన్నీ బాగా చూసి సెలెక్టు చేసి తెచ్చాడనుకుందాం. కానీ అతని భార్యకు అంత తక్కువ చీర నచ్చలేదు. మొన్ననే పక్కింటి పార్వతికి వెడ్డింగ్ డే నాడు వాళ్ళాయన 4 వేల పట్టుచీర కొన్నాడు, పోయిన సంవత్సరం పెళ్ళిరోజున నక్లెస్ చేయించాడు. ఇవన్నీ మనసులో ఉన్న ఆ భార్యామణికి ఆ చీరను చూడగానే నిర్లిప్తత ఆవరిస్తుంది. ఎలా ఉందోయ్ చీర అని పాపం ఆ భర్త ఉత్సాహంగా అడుగుతాడు. ఆ! నా మొహానికి ఇంతకన్నా ఖరీదైన చీరలు ఎప్పుడు తెచ్చారు గనుక అంటూ.. దాన్ని తీసుకుని విసవిసా లోనికి వెళ్లిపోతుంది ఆ శ్రీమతి, సో మనీ ఈజ్ వెరీ పవర్ ఫుల్ అని డబ్బు విలువ తెల్సుకుంటాడు ఆ భర్త.
ఇక తల్లిదండ్రులు తమ బిడ్డలపై చూపే ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఎందుకంటే.. తమ ప్రతిరూపంగా జన్మించిన బిడ్డ, తమ రక్తాన్ని పంచుకు పుట్టాడన్న అభిమానమూ, ఆప్యాయతా, ప్రతి తల్లిదండ్రులకూ ఉంటుంది. అలాంటి ప్రేమ కూడా డబ్బు విషయాలతో కలుషితం కావడం ఎంతైనా శోచనీయం.
ఓ తండ్రికి ఇద్దరు కొడుకులున్నారనుకుందాం. పెద్దవాడికి ఉద్యోగం ఉంది. చిన్నవాడు బాగా చదువుకోనందున ఏదో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు అనుకుందాం. ఇద్దరూ తల్లిదండ్రులుండే ఊరికి దూరంగా ఉంటున్నారు. నెలకోమారు వచ్చి చూసిపోతుంటారు. చిన్నవాడికి తల్లిదండ్రులంటే అమితమైన ప్రేమ. వచ్చినప్పుడు చిన్నవాడు తల్లిదండ్రుల బట్టలు ఉతికేవాడు, తండ్రి దుస్తులు ఇస్త్రీ చేసేవాడు. వాళ్ళకు పళ్లు తీసుకొచ్చి ఇస్తాడు. తండ్రి కాళ్ళొత్తుతాడు. వెళ్ళేటప్పుడు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి మరీ వెళ్తాడు. ఇక పెద్దవాడు రాగానే మొహం కడుగుకుని ఊళ్లో మిత్రులందరినీ కలిసి వచ్చి, భోం చేసి, కొద్దిసేపు పడుకుంటాడు. లేచి ఊళ్లో వాళ్ల విషయాలు అడిగి తెల్సుకుని, అమ్మా నాన్నా ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతూ, ఇదిగో ఈ వెయ్యి రూపాయలు ఖర్చులకు ఉంచుకోండి అని వాళ్ల తండ్రి చేతిలో డబ్బులుంచి వెళ్లిపోతాడు. అప్పుడు బంధువులు, చుట్టు ప్రక్కల వారు, చివరికి కొన్నిళ్ళల్లో కొందరు తల్లిదండ్రులు కూడా పెద్దవాడు జాలిగుండె గలవాడు, పెద్దచేయి గలవాడు, మంచివాడు అని, చిన్నవాడు మంచి నటుడు. ఏదో కాస్తంత సేవ చేసినట్లు నటించి, ప్రతీసారి డబ్బులివ్వకనే జారుకుంటాడు అని మాట్లాడుకోవడం చూస్తుంటాం! కనుక జననీ జనకుల దృష్టిలో కూడా మంచి మార్కులు పట్టేయాలంటే Money కావాలన్ని నిజం గుర్తించండి.
ఎంతో రహస్య విషయాలు సైతం చెప్పుకునే స్నేహితుల స్నేహబంధాన్ని, జీవితాంతం కలిసి సహచర్యం చేసే భార్యాభర్తల సంసార బంధాన్ని, గుండెల్లో పెట్టుకుని పిల్లల్ని చూసే తలిదండ్రుల ప్రేమబంధాన్ని సైతం Money ఈరకంగా ప్రభావితం చేస్తుందంటే Money ప్రభావం గురించి ఇంకేం చెప్పాలి? ఎక్కువ Money సంపాదించండి, పొదుపుగా ఖర్చు చేయండి.
- చెప్పే ప్రతి పనీ సకాలంలో చేసే సహోద్యోగి కన్నా మందు పార్టీలు ఇచ్చే సహోద్యోగి అంటేనే ప్రేమ అధికంగా ఉంటుంది బాస్ కి. ఎందుకంటే పనులేవడైనా చేస్తాడు. కనీ ఫ్రీగా మందు పొయించాలంటే మనీ ఉండొద్దూ… ఇదండీ ‘ధనానికి’ మనిషి జీవితంలో ఉన్న విలువ. ‘ధనం’ విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఓడలు బళ్ళవుతాయి బికేర్ ఫుల్.
- వినయ విధేయత గల శిష్యుడూ, మేధావి అయిన శిష్యుడు కంటే, తనకు బహుమతులు తెచ్చే విద్యర్దే చాలా ఇష్టం కొందరు ఉపాధ్యాయులకు.
- గిచ్చి గిచ్చి బేరం చేసే కస్టమర్ కన్నా చెప్పిన రేటు ఇచ్చి కొనే కష్టమరే ఎక్కువ ఇష్టం దుకాణదారుడికి.
- అత్తవారింటికి వెళ్తే ఆప్యాయంగా కొసరి వడ్డించే అత్తమామల కన్నా ఏదో ఒక మంచి కానుక ఇచ్చి పంపే అత్తమామలంటేనే ఇష్టం అల్లుళ్లకి.
- నంది అవార్డు వచ్చి బాక్సాఫీస్ వద్ద సినిమా ఫెయిల్ అవడం కన్నా ఏ అవార్డూ రాకున్నా 100 రోజులు సినిమా ఆడడమే హేపీ హీరోలకి.
- టిప్పులివ్వని కస్టమర్ అంటే చిరాకు సర్వర్‌కి. టిప్పులిచ్చే కస్టమర్ అంటే ప్రేమ సర్వర్‌కి.
ఇటువంటి ఎన్ని ఉదాహరణలైనా తీసుకోండి. డబ్బుకు ఓ ఖచ్చితమైన ప్రాధాన్యత ఉంది అని మనకు అర్థమౌతుంది.
సక్రమ మార్గంలో ధనార్జన చేసే విషయంలో రోజులో 20 గంటలు కష్టపడండి. ధనం కూడబెట్టండి. సమాజంలో ఓ గుర్తింపు తెచ్చుకోండి. ధనాన్ని కేవలం స్వార్ధానికే కాకుండా పరమార్ధనికి, పరుల సేవకు, నరుల సేవకు, మూగజీవుల కోసం కాస్త ఖర్చు చేయడం అలవరుచుకోండి. కోటి రూపాయలు మీ ఖాతాలో జమ చేసినపుడు… బ్యాంక్ మేనేజర్ ముఖంలో కన్పించే వెలుగు కన్నా 10 రూపాయలు ఆకలిగా ఉన్న బిచ్చగాడికి దానం చేసినపుడు అతని ముఖంలో కన్పించే వెలుగు మీకు కోటిరెట్లు ఆనందాన్నిస్తుంది.