Ugadi : తెలుగు వారి సంవత్సరం మొదలు ఉగాది. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఉగాది పండుగ రోజు ఏమి చేయాలి ? ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు ? పంచాంగ శ్రవణం ఎందుకు? ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలో ఉగాది ఒకటి. ముఖ్యంగా ఈ పండగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను. తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకలో ఉగాది, మహారాష్ట్రలో గుడి పడ్వా, తమిళనాడులో పుత్తాండు అనే పేరుతో, మలయాళీలు విషు అనే పేరుతోను, సిక్కులు వైశాఖీ గానూ, బెంగాలీలు పొయ్‌లా బైశాఖ్ గానూ జరుపుకుంటారు.
తెలుగు రాష్ట్రాలలో ఉగాది రోజున పంచాంగ శ్రవణం చేస్తారు. అంతేకాకుండా రుచికరమైన ఉగాది పచ్చడి చేస్తారు. ఉగాది తెలుగువారికి సంవత్సరం మొదలు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకుంటారు. ఈరోజునే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని అందరు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ఈరోజు నుంచే ప్రారంభం అవుతాయి. రైతులు ఇదే సమయంలో పంటలు వేస్తారు. కొత్త జీవితానికి నాందిగా ఈ వేడుకను జరుపుకుంటారు.
Ugadi రోజున తెలుగు రాష్ట్రాల్లో చేసే ఆరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఇందులో లేత మామిడికాయ, కొత్త బెల్లం, కొత్త చింతపండు రసం, వేపపువ్వు, మిరియాలు, ఉప్పు వేసి చేస్తారు. అంతే కాకుండా ఈ రోజున మిత్ర దర్శనమం ఆర్యపూజనం, గోపూజ, ఏరువాక అనే ఆచారాలను పాటిస్తారు. ఉగాది పండుగ అయిన వారం తర్వాత శ్రీరామనవమి వస్తుంది.
శ్రీ శుభకృత్ (Sri Sobhakritu) నామ సంవత్సరం పూర్తిచేసుకుని శ్రీ శోభకృత్ (Sri Shobhakritu) అడుగుపెడుతున్నాం. మార్చి నెల 22వ తేది బుధవారం పాడ్యమి. ఈ రోజు నుంచి తెలుగు కొత్త సంవత్సరం అయిన శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ప్రారంభం అవుతుంది.
శ్రీ శోభకృత్ నామసంవత్సర ఉగాది ఈ సంవత్సరం మార్చి నెల 22వ తేది బుధవారం వస్తుంది. ఆ ముందురోజు అంటే.. శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో చివరి రోజు వచ్చే ఫాల్గునమాస అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. ఈ రెండు రోజులూ తెలుగు రాష్ట్రాలలో సందడి వాతావరణం ఉంటుంది.
Ugadi విశిష్ఠత
ఋతూనాం కుసుమాకరాం అని శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో స్వయంగా చెప్పాడు. అంటే తానే వసంత ఋతువునని అర్థం. వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా చైత్రమే. అయితే చైత్రమాసం అనగానే Ugadi, శ్రీరామనవమి గుర్తుకొస్తాయి కానీ దశావతారాల్లో మొదటి అవతారం అయిన మత్స్యావతారం, యజ్ఞ వరాహమూర్తి జయంతి, సౌభాగ్య గౌరీ లాంటి విశిష్టమైన రోజులెన్నో ఈ నెలలో ఉన్నాయి. కాబట్టే చైత్ర మాసం సంవత్సరానికి మొదటి నెల మాత్రమే కాకుండా, ఎన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసంగా చెబుతారు. ఈ నెలలో చంద్రుడు పౌర్ణమినాడు చిత్త నక్షత్రంతో కలిసి ఉంటాడు.
ఈ Ugadi ప్రకృతిలో చాలా మార్పులు జరుగుతాయి. చెట్లు చిగురించే కాలం వసంతకాలం. సంవత్సరానికి యుగం అనే పేరు కూడా ఉంది. అందుకే యుగాది అంటారు. కాలక్రమేణా ఉగాది అయింది. ఒక్క చాంద్రమానాన్ని అనుసరించే వారు మాత్రమే కాకుండా సౌరమానాన్ని పాటించే వారిలో కొంత మంది ఈ రోజు నుంచి సంవత్సరంగా భావించి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకుంటారు.
ఉగాది రోజు ఉదయానే లేసి తల, శరీరం అంతా నూనె రాసుకుని అభ్యంగన స్నానం చేయాలి. తర్వాత నూతన వస్త్రాలు ధరించాలి. భక్తితో భగవంతుడికి నమస్కారం చేసుకుని ఉగాది పచ్చడి తినాలి. ఉగాది రోజున పూజించడానికి ప్రత్యేకంగా దేవతలు ఎవరు లేరు కాబట్టి అన్ని రకాల దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకోవచ్చు.
సృష్టి మొదలు అయిన రోజు Ugadi
సృష్టి మొదలు అయిన రోజు ఉగాది అని చెబుతారు. అందువలనే సృష్టికి మూల కారణం అయిన బ్రహ్మదేవుడుని ఈ రోజున ప్రత్యేకంగా పూజించి, షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారు. ఈ ఉగాది రోజున ప్రత్యేకంగా పంచాంగ శ్రవణం ఉంటుంది, అవధానాలు, కవి సమ్మేళనం వంటివి తెలుగు వారి ప్రత్యేకతను చాటుకుంటాయి.
కొత్త అమావాస్య
ఫాల్గుణ మాసం చివరి రోజు, అంటే ఉగాది ముందురోజు వచ్చే అమావాస్యను కొత్త అమావాస్య అంటారు. చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య ఇది. ఆ తర్వాతి రోజు నుండి కొత్త తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. మాములుగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రధానాలు చేయడం, తర్పణాలు వదలడం చేస్తూ ఉంటారు. ఆలాంటి ఈ విశిష్టమైన అమావాస్య రోజున చేసే పిండ ప్రధానాలు పితృదేవతలకు సంతృప్తి కలిగి వారి ఆశీర్వాదాలు మీపై ఎల్లప్పుడు ఉంటాయి. అమావాస్య రోజు ఆలోచనలు, ఏకాగ్రత చాలా తీక్షణంగా ఉంటాయి. ఆ రోజు జప తపాలకు విశేష ఫలితాలు ఉంటాయి.
ఆమావాస్య రోజున ఉపవాసం ఉండటం వలన చెడు ఆలోచనలు కలగకుండా సాత్విక భావనతో ఉండవచ్చు. ఈ అమావాస్య రోజున సంకల్పబలం బలంగా ఉంటుంది కాబట్టి ఈ రోజు భగవంతుడిని ఆరాధిస్తే ఎన్నో రెట్లు ఫలితం పొందుతారని పెద్దలు చెబుతారు.