Stock Market : ఈ వ్యాసంలో మనం స్టాక్ మార్కెట్ అంటే ఏమిటి? మనం నిద్రపోతూ కూడా డబ్బు సంపాదించే మార్గాలలో ఒకటైనా స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకుందాం.
Stock Market
కూరగాయలు కొనాలంటే కూరగాయల మార్కెట్‌కు వెళతాం. ఇంట్లోకి సరుకులు కావాలంటే సూపర్ మార్కెట్‌కు వెళ్లి తెచ్చుకుంటాం. ఇతర వస్తువుల క్రయవిక్రయాలకు సంబంధించి ఆయా మార్కెట్లకు వెళతాం. అయితే కంపెనీలకు సంబంధించిన షేర్లు లేదా స్టాక్‌లు కొనుగోలు చేయాలన్నా.. విక్రయించాలన్నా Stock Market కు వెళ్లాల్సిందే. ఈ స్టాక్ మార్కెట్లలోనే అనేక రంగాలకు చెందిన కంపెనీల షేర్లు నమోదై ఉంటాయి. వాటిలో ప్రతి రోజు ట్రేడింగ్ (Trading) జరుగుతుంటాయి.
అంటే ఆ కంపెనీల షేర్లను కొందరు కొనుగోలు చేస్తుంటే మరికొందరు అమ్ముతుంటారు. దీని వల్ల కొంత మందికి లాభం రావొచ్చు ఇకొంత మందికి నష్టం రావొచ్చు. స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్‌లో కంపెనీల షేర్ల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం మన దేశంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(NSE)లు ప్రధానమైన స్టాక్ ఎక్స్ఛేంజ్లుగా ఉన్నాయి. బీఎస్ఈ లో 30 పెద్ద కంపెనీల షేర్లతో సెన్సెక్స్ (SENSEX) సూచీ ఉంటుంది. ఎన్ఎస్ఈలో 50 కంపెనీల షేర్లతో నిఫ్టీ (NIFTY) సూచీ ఉంటుంది. ఈ షేర్ల ధరల్లో ఏర్పడే తేడాలను బట్టి సూచీల పెరుగుదల, తరుగుదల ఉంటుంది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదైన కంపెనీల షేర్ల మొత్తం విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalization) అంటారు.
ఈ ఎక్స్సేంజీల్లో దేశంలోని వేలాది కంపెనీల షేర్లు నమోదై ఉన్నాయి. ప్రతి రోజు లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతుంటాయి. ఎవరైనా ఈ కంపెనీల షేర్లను కొనుగోలు చేయవచ్చు.. అమ్మవచ్చు. స్టాక్ బ్రోకరరేజీలు, ఎలక్ర్టానికి ట్రేడింగ్ ప్లాట్ ఫామ్‌ల ద్వారా కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. షేర్లలో ట్రేడింగ్ చేయాలంటే అందుకు అవసరమైన డీమాట్ అకౌంట్ (DEMAT ACCOUNT), ట్రేడింగ్ అకౌంట్ (TRADING ACCOUNT) అవసరం. షేర్లను ఎలక్ర్టానిక్ రూపంలో కలిగి ఉండటానికి, షేర్లలో ట్రేడింగ్ నిర్వహించడానికి ఇవి ఉపయోగపడతాయి.
స్టాక్స్ జారీ చేయడం ద్వారా కంపెనీలు తమకు కావాల్సిన మూలధనాన్ని (Capital) సమకూర్చుకోవటంలో స్టాక్ మార్కట్ లేదా షేర్ మార్కెట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ మూలధనాన్ని కంపెనీలు తమ వ్యాపారాలకు నిధులు సమకూర్చడానికి మరియు వ్యాపారాలను విస్తరించడానికి ఉపయోగపడుతుంది.
ఒక కంపెనీ ప్రారంభంలో ఒక షేరుని 10 రూపాయలకి నిర్ణయించి. ఒక లక్ష షేర్‌లను స్టాక్ మార్కెట్‌లో జారీ చేస్తే, అది కంపెనీకి 10 లక్షల మూలధనాన్ని అందిస్తుంది. ఈ మూలధనాన్ని ఆ కంపెనీ తన వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు (స్టాక్ ని నిర్వహించడానికి పెట్టుబడి బ్యాంకుకి చెల్లించే రుసుము పొగ మిగిలినది). కంపెనీలు తమ వ్యాపారాలకు అభివృద్ధి కోసం మరియు వ్యాపారాలను విస్తరించడానికి అవసరమైన మూలధనాన్ని అప్పుగా తీసుకొనే బదులు స్టాక్ షేర్ల ద్వారా కంపెనీ అప్పుల చేయకుండా మరియు రుణలపై వడ్డీ చార్జీలు చెల్లించకుండా చేస్తుంది. Stock Market లేకపోతే కంపెనీలు తమ వ్యాపారాలను వృద్ధి చేయడానికి లేదా విస్తరించడానికి మూలధనం కోసం అప్పులు చేసి వాటికీ వడ్డీ చెల్లించే క్రమంలో చాలా సార్లు కంపెనీలు అప్పులపాలు అయ్యి కంపెనీలు దివాళా తీసే అవకాశం ఎక్కువ. కంపెనీ యొక్క వ్యాపారాలను సంరక్షిస్తు దానితో పాటు దేశ ఆర్థిక స్థితిని కాపాడేందుకు ఈ స్టాక్ మార్కట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఇక స్టాక్ మార్కెట్లను జాతీయ (NATIONAL), అంతర్జాతీయ (INTERNATIONAL) పరిణామాలను ఎంతగానో ప్రభావితం చేస్తుంటాయి. ప్రతి రోజు జరిగే సంఘటనలు వాటితో సంబంధం ఉండే కంపెనీల షేర్ల ధరలను ప్రభావితం చేస్తుంటాయి. దానికారణంగా అ కంపెనీ షేర్ల ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారు అందుకు అవసరమైన విషయాల గురించి అవగాహన పెంచుకోవాల్సి ఉంటుంది. అవగాహన లేకుండా గుడ్డిగా నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. షేర్లలో నేరుగా పెట్టుబడి పెట్టలేని వారు మ్యూచువల్ ఫండ్స్(MUTUAL FUNDS)ను ఎంచుకోవచ్చు. ఈ సంస్థలు వివిధ రకాల ఫండ్స్ ఆఫర్ చేస్తుంటాయి. వాటి నిర్వహణ బాధ్యతను కూడా అవే చూసుకుంటాయి. కాబట్టి వీటిని ఎంచుకోవచ్చు.