Ugadi Pachadi Recipe: షడ్రుచులతో శాస్త్రీయ తయారీ విధానం ఉగాది శుభాకాంక్షలతో
శ్రీ శోభకృత్ నామసంవత్సరం (2023-24):
ఆరు రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. ఈ ఆరు రుచులు ధాతువులే మన శరీర ఆరోగ్యాన్ని నియంత్రించేది. ఇవి బాలన్స్ గా ఉన్నంత కాలం మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. ఇందులో ఏవి ఎక్కువైనా… ఏవీ తక్కువైనా… ఆనారోగ్యసమస్యలు మొదలైనట్టే. వాత, పిత్త, కఫ లక్షణాలను సూచించేవి ఈ ఆరు రుచులే.
తీపి ఎక్కువైతే… షుగర్, పులుపు ఎక్కువైతే జీర్ణ సమస్య, ఇలా ఏది ఎక్కువైనా, తక్కువైనా ఆరోగ్యం దెబ్బ తింటుంది. ఇది శరీర ఆరోగ్యానికే కాదు. జీవితానికి కూడా వర్తిస్తుంది. కష్టాలు, సుఖాలు, ఆనందం, ఆశలు, పని, కోరికలు ఇలాంటివి బాలన్స్ గా ఉంటే జీవితం ఒకే…
ఇందులో ఏది ఎక్కువైనా… జీవితంలో సమస్యే. సుఖం ఎక్కువైనా… కష్టం ఎక్కువైనా… జీవితం అదుపు తప్పుతుంది. ఈ పరమార్ధాన్ని మనం అర్ధం చేసుకోవడానికే పెద్దలు, సంవత్సరం తొలి రోజునే ఉగాది పచ్చడి రూపంలో మనకు జీవితాన్ని, ఆరోగ్యాన్ని రుచి చూపించే మహత్తర ఔషదాన్ని కానుకగా ఇచ్చారు.
మామిడి – వగరు, జీర్ణ రసాల ఉత్పత్తిని చేస్తుంది.
చింతపండు – పులుపు, జీర్ణశక్తికి సాయపడుతుంది.
మిరియాలు – కారం, రోగనిరోధక శక్తిని ఇస్తుంది.
వేపపువ్వు – చెదు, రక్తంని శుద్ది చేసి, హానికారక క్రిములను అంతమొందిస్తుంది.
లవణం – ఉప్పు, ఇది ఎక్కువై ఇప్పుడు చాలా రకాల జబ్బులకు కారణం అవుతుంది.
మితంగా వాడితే అద్భుతమైన ఔషదంగా పని చేస్తుంది.
బెల్లం – తీపి, అద్భుతమైన బలాన్ని, ఐరన్ ను అందిస్తుంది.
ఇలా ఎక్కువ, తక్కువలు కాకుండా… ఈ సంవత్సరం Ugadi Pachadi ని, స్వచ్చమైన శాస్త్రీయ పద్దతిలో తయారు చేసుకుందాం.
వేద కాలం నాటి నుంచి ఇవే పదార్దాలతో ఉగాది పచ్చడి చేస్తున్నారు. ఈ మధ్య రుచి కోసం అరటి పండ్లు, కొబ్బరి లాంటివి కలుపుతున్నారు.
కాని శాస్త్రీయంగా ఉగాది పచ్చడికి కావాల్సినవి ఆరు రుచులను ఇచ్చే ఈ ఆరు పదార్ధాలు –
- లేత మామిడికాయ
- కొత్త బెల్లం ఒక కప్పు
- కొత్త చింతపండు రసం ఒక కప్పు
- ఒక కప్పు వేపపువ్వు
- మిరియాలు అర చెంచా
- ఉప్పు తగినంత
Ugadi Pachadi తయారు చేసే విధానం
ముందుగా మామిడికాయను, బెల్లంని చిన్న చిన్న ముక్కాలుగా చేసి పెట్టుకోండి. చింతపండు రసాన్ని పిండి పక్కన పెట్టుకోండి. మిరియాలను మెత్తగా దంచి పౌడర్ చేయండి. పుల్లలు లేకుండా వేప పువ్వులను సిద్దం చేసుకోండి. అన్ని పదార్ధాలన్నీ కుండలో వేసి మంచి నీళ్లు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలిపితే చాలు… శాస్త్రీయమైన ఉగాది పచ్చడి రెడీ అయినట్టే… నీళ్లు కాని, పదార్థాలు తీసుకోవాల్సిన క్వాంటిటి కాని… మీ ఇంట్లోని సభ్యుల సంఖ్యను బట్టి తయారు చేసుకోండి.
సంపన్నులకైనా, పెదవారికైనా… దేవుడు అన్నీ సమానంగా ఇస్తాడు. మనం సృష్టించుకున్న ఆస్తులు, ఆర్భాటాలు కాకుండా ఆయన ఇచ్చేవి ఎప్పుడు లెక్క తప్పదు. పుట్టుక, మరణం, కష్టం, సుఖం, దుఃఖం, అనందం లాంటివి లెక్క కట్టితే ఖచ్చితంగా అందరూ సమానమే అవుతారు. ఈ ఉగాది పచ్చడి కాన్సెప్ట్ అదే. అన్ని రుచులు ఒకేలా ఉండవు. అన్ని పరిస్థితులు, అందరు మనుషులు ఒకేరకంగా ఉండరు. ఈ తేడానే జీవితాన్ని అద్భుతంగా మలుస్తుంది. ఎలా ఉన్నా జీవితాన్ని, ఆరోగ్యాన్ని, బంధాలను ఆస్వాదిస్తూ సాగాలనే సందేశమే Ugadi Pachadi అర్ధం.
తెలుగువారి సంవత్సరాది ఉగాది. ఈ పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగ ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, దీని విశిష్టత ఏంటో తెలుసుకోవాలంటే telugupencil.com ను చూడండి.