Tirumala Theerthalu : తిరుమల క్షేత్రం ఎన్నో పుణ్యతీర్థాలకు నిలయం. అనాదిగా ఎందరో మహనీయులు తిరుమలేశుని గూర్చి తపస్సు చేస్తూ శ్రీస్వామివారిని ప్రత్యక్షం చేసుకొన్న దివ్యస్థలాలే ఈ తీర్థాలు. సర్వపాపహరాలైన ఈ తీర్థ విశేషాలను పూర్తిగా తెలుసుకుందాం.
Tirumala Theerthalu
గోగర్భం (పాండవ తీర్ధం)
Tirumala Theerthalu : తిరుమల శ్రీవారి ఆలయానికి ఈశాన్యమూలగా ఒక మైలు దూరంలో గోగర్భం తీర్థం వుంది. పాండవులు అరణ్యవాసం చేసిన సందర్భంలో ఇక్కడ కొంతకాలం వున్నారట. అందుకు గుర్తుగా ఇక్కడి గుహలో పాండవుల శిల్పాలున్నాయి. పాండవతీర్థంలోని గుహ గోవుగర్భం మాదిరిగా వుండటం వల్ల గోగర్భమనీ పిలువబడింది.
పాపవినాశనం
Tirumala Theerthalu : తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరం దిక్కున 3 మైళ్ల దూరంలో నెలకొన్న తీర్థం పాపవినాశనం. ఈ తీర్థస్నానం వల్ల ఘోర పాపాలు పోతాయట. ధృఢమతి అనువాడు అనేక పాపాలు చేసి గ్రద్దగా జన్మించాడట. ఆ గ్రద్ద ఇందులో స్నానం చేసినందు వల్ల నేరుగా ముక్తి కలిగిందట. ఒక విప్రుడు బ్రహ్మరాక్షసుని నుండి విముక్తి పొందాడు. భద్రమతి అనే వ్యక్తి ఈ తీర్థాన్ని సేవించి సంపన్నుడయ్యాడు. ఈ తీర్థంలో ఆశ్వయుజ శుద్ధ సప్తమి ఉత్తరాషాఢా నక్షత్రంలో కూడిన ఆదివారం నాడు లేదా ఉత్తరాభాద్ర నక్షత్రంతో కూడిన ద్వాదశి నాడు కాని స్నానం చేయటం ఉత్తమం. తిరుమల నుంచి ఈ తీర్ధానికి బస్సు సౌకర్యం ఉంది.
ఆకాశ గంగ
Tirumala Theerthalu : ఇది శ్రీస్వామి పుష్కరిణికి ఉత్తరాన రెండు మైళ్ల దూరంలో ఉంది. పూర్వం అంజనాదేవి ఇచ్చట తపస్సు చేసి ఆంజనేయుని పుత్రునిగా పొందినందు వల్ల ఇది అంజనాద్రిగా పిలువబడింది. ఆకాశ గంగాతీర్థంలో పూర్వం రామానుజుడనే విప్రుడు తపస్సు చేసి శ్రీవేంకటేశ్వరుని ప్రత్యక్షం చేసికొన్నాడు. మేష మాసంలో చిత్తా నక్షత్రంతో కూడిన పున్నమి నాడు ఈ తీర్థంలో స్నానం చేస్తే ముక్తి కలుగుతుంది. పూర్వం ఒక విప్రుడు తనకు వచ్చిన గాడిద ముఖాన్ని ఈ తీర్థంలో స్నానం చేసి పోగొట్టుకున్నాడు. ఈ తీర్థంలో తి.తి.దేవస్థానం పురోహితుల ద్వారా యాత్రీకులు క్రియలు నిర్వహించుకోవచ్చును. ఈ తీర్థానికి బస్సు సౌకర్యం ఉంది. వైష్ణవస్వాములు ప్రతిరోజు శ్రీవారి అభిషేకానికి గాను రెండు బిందెల ఆకాశగంగ తీర్థ జలాన్ని తీసుకెళ్తారు.
జాబాలి తీర్థం
Tirumala Theerthalu : తిరుమల శ్రీస్వామి పుష్కరిణికి ఉత్తరాన రెండు మైళ్ల దూరంలో అత్యంత ప్రకృతి రామణీయకమైన లోయలో ఈ తీర్థం వుంది. జాబాలి మాహర్షి కొంతకాలం తపస్సు చేసినందు వల్ల ఆయన పేరుతో ఈ తీర్థం ప్రసిద్ధమైంది. పూర్వం దురాచారుడనే విప్రుడు ఈ తీర్థంలో స్నానం చేసి బ్రహ్మరక్కసి నుండి విముక్తి పొందాడు. కొంత కాలం అగస్త్య మహర్షి ఇక్కడ తపస్సు చేసి శ్రీనివాసుణ్ణి ప్రత్యక్షం చేసికొన్నాడు. ఈ తీర్థంలో ఆంజనేయస్వామి వారి ప్రాచీనమైన ఆలయం వుంది. ఈ ఆలయం మహంతు మఠంవారి అధీనంలో వుంది. ఈ తీర్థానికి, తిరుమల నుంచి పాపవినాశనం వేళ్లే దారిలో బస్సు దిగి ఒకమైలు దూరం నడిచి వెళ్లవచ్చు.
వైకుంఠ తీర్థం
Tirumala Theerthalu : శ్రీస్వామి పుష్కరిణికి ఈశాన్యమూలలో రెండు మైళ్ల దూరంలో ఒక గుహ వుంది. ఈ గుహకు ‘వైకుంఠ గుహా’ అనీ, అందులోంచి ఎప్పుడూ బయటికి వచ్చే తీర్థానికి ‘వైకుంఠం తీర్థం’ అనీ అంటారు. శ్రీరాముడు వానర సైన్యంతో కూడి ఇక్కడికి వచ్చిన సందర్భంలో వానరులకు ఈ గుహలో ఒక పెద్ద నగరం, అందులో శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చాడట. ఇంతలో ఆయుధ పాణులు వానరులను తరుమగా వెలుపలికి వచ్చేసరికే గుహమూసుకొని వుండిందట. ఈ విషయాన్ని విన్న శ్రీరాముడు ఇది భూలోక వైకుంఠం ఇందులో శ్రీమహావిష్ణువు సంచరిస్తుంటాడు ఆయన దర్శనమే మీకు కలిగిందన్నాడట. ఈ తీర్థానికి సరియైన దారి లేదు.
చక్ర తీర్థం
Tirumala Theerthalu : తిరుమల శ్రీవారి ఆలయానికి వాయవ్య దిక్కున 2 మైళ్ల దూరంలో చక్రతీర్థం వుంది. 250 కోట్ల సంవత్సరాల నాటిదిగా ఇటీవల కనుగొనబడిన “శిలాతోరణం” పక్కనే వంద అడుగుల దూరంలో ఈ చక్రతీర్థం వుంది. ఈ తీర్థంలో తపస్సు చేస్తున్న పద్మనాభుడనే భక్తుని రక్షించవలసిందని శ్రీనివాసుడు సుదర్శన భగవానుని ఆదేశించాడట. అప్పటి నుంచి చక్రతీర్థంగా పిలువబడుతున్నది.
శ్రీరంగం నుండి సుందరుడనే విప్రుడు తనకు కలిగిన రాక్షసత్వాన్ని ఈ తీర్థానికి వచ్చి పోగొట్టుకున్నాడు. ప్రతి సంవత్సరం కార్తీక బహుళ ద్వాదశి నాడు ఈ చక్రతీర్థ ముక్కోటి జరుగుతుంది. ఆనాడు శ్రీవారి ఆలయం నుంచి అర్చకులు ప్రసాదాలతో వచ్చి ఇక్కడ వెలసిన సుదర్శనునికి, శ్రీనరసింహస్వామికి అభిషేకార్చనలు, నివేదనలు చేస్తారు. శిలాతోరణం చూడవచ్చిన భక్తులు చక్రతీర్థాన్ని కూడా దర్శించవచ్చు.
శ్రీరామకృష్ణ తీర్థం
Tirumala Theerthalu : శ్రీస్వామివారి ఆలయానికి ఉత్తరం దిక్కున సుమారు 6 మైళ్ల దూరంలో రామకృష్ణ తీర్థం వుంది. పూర్వం కృష్ణుడనే ముని, ఆ తర్వాత రామకృష్ణుడనే ముని తపస్సు చేసి స్వామివారిని ప్రత్యక్షం చేసికొన్నందువల్ల ఇది రామకృష్ణ తీర్థమయ్యింది. మకరమాస పుష్య నక్షత్రంతో కూడిన పున్నమి నాడు శ్రీవారి ఆలయం నుండి అర్చకులు వెళ్లి అక్కడ శ్రీరామకృష్ణులకు అభిషేకార్చనలు చేసి వస్తారు. ఈ తీర్థానికి యాత్రీకులు పాపవినాశనం వరకు బస్సులో వెళ్లి అచ్చటి నుండి నడచి వెళ్లాలి.
కుమారధారా తీర్థం
Tirumala Theerthalu : తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 6 మైళ్ల దూరంలో ఈ తీర్థం వుంది. పాపవినాశనం వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి నడచి ఈ తీర్థాన్ని చేరుకోవాలి. సర్వవిధాల రోగపీడితుడైన ఒక వృద్ధుడు ఈ తీర్థంలో స్నానం చేసి కుమారుడైనాడట. అందువల్లే ఇది కుమారధారా తీర్థం. అంతేగాక కుమార స్వామి తారకాసుర సంహారం వల్ల కలిగిన బ్రహ్మహత్యా పాపాన్ని ఈ తీర్థంలో తపస్సుచేసి పోగొట్టుకొన్నాడట. ప్రతి సంవత్సరం మాఘ పూర్ణిమకు ఈ తీర్థంలో స్నానం చెయ్యడం అత్యంత ఫలప్రదం.
తుంబురు తీర్థం (ఘోణ తీర్థం)
Tirumala Theerthalu : తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరం దిక్కున సుమారు పది మైళ్ల దూరంలో తుంబురు తీర్థం వుంది. దీన్నే ఘోణ తీర్థం, తుంబ తీర్థం అని కూడా అంటారు. తుంబురుడనే మహర్షి తపస్సు చేసినందువల్ల ఇది తుంబురు తీర్థంగా పిలువబడింది. ఈ తీర్థంలో సర్వాబద్ధుడనే నాస్తికుడు స్నానం చేసి “సర్వసిద్ధుడు” గా మారి మోక్షం పొందాడు.
ఫాల్గుణ పున్నమి నాడు ఈ తీర్థముక్కోటి. వేలాది మంది భక్తులు వెళ్తారు. తిరుమల నుండి పాపవినాశనం వరకు బస్సులో వెళ్లి అక్కడి నుంచి 7 మైళ్లు నడిచి వెళ్లాలి.
ఇవే కాక ఈ తిరుమల దివ్యక్షేత్రంలోని పర్వత సానువులలో జరాహర తీర్థం, ఫల్గుణి తీర్థం, సనకసనందన తీర్థం, కాయరసాయన తీర్థం, దేవ తీర్థం, అస్తిసరోవర తీర్థం, కటాహ తీర్థం, శేష తీర్థం, శంఖ తీర్థం… మున్నగు అనేకానేక తీర్థాలు పుష్కరిణిలు విలసిల్లుతున్నాయి. అందువల్లే ఈ వేంకటాచలం “పుష్కరాద్రి” అని కూడా పిలవబడుతున్నది.