Friday, September 6, 2024
Homeఆధ్యాత్మికం16 Somavarala Vratha Katha | 16 సోమవారాల వ్రత కథ

16 Somavarala Vratha Katha | 16 సోమవారాల వ్రత కథ

16 Somavarala Vratha Katha : 16 (షోడశ)  సోమవారాల వ్రతం కలియుగమున మానవులకు కల్పవృక్షము వంటిది. ఈ వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించి, ఈ కథను చదువుకొనినవారు ధన్యులు. కావున మనము అందరమును యధాశక్తిగ 16 సోమవారాల వ్రతం ఆచరించి పరమశివుని ఆశీర్వాదం మరియు అనుగ్రహమును పొందెదము గాక.

 

         నైమిశారణ్యములో జ్ఞాన యజ్ఞ నిరతులైన శౌనకాది మహర్షులు సూతునకు నమస్కరించి “ఓ మహర్షి! మీరు మాకు అనేక సత్కథులు చెప్పితిరి. యే వ్రతమును ఆచరించుట వలన శ్రీఘ్రముగా ఫలప్రాప్తి కలుగునో అటువంటి ఉత్తమోత్తమైన ప్రతము నొకదాన్ని మాకు ఉపదేశింపు” డని ప్రార్ధించిరి.

        అంతట సూతుడు “మహాత్ములైన మహర్షులారా! ఒక రోజు కైలాశములో దివ్య రత్న ఖచిత సింహాసనంపై కూర్చొనియున్న పరమేశ్వరుని పార్వతి ఏకాంతంలో ఇట్లా ప్రశ్నించింది.   

        “స్వామీ! నేను మీ వద్ద అనేక శాస్త్రములను ఆగమ విద్యలను నేర్చుకున్నాను. సర్వకాల సర్వావస్థలలోను అల్పప్రయాసచే మహత్తరమైన ఫలమును ప్రసాదించు వ్రతము నొకటి నాకు ఉపదేశించుడు.”

        అది విని మందహాసముతో సదాశివుడు “ప్రియా! నీ ప్రశ్న ఉచితముగాను, లోకోపకారిగాను ఉన్నది. లోకహితము కోరిన నీకు ఒక శ్రేష్టమైన వ్రతమును చెప్పెదను” అంటూ ఇలా చెప్పసాగాడు.

        నక్షత్రములో సూర్యుడు, గ్రహములలో చంద్రుడూ నదులన్నింటిలో గంగానది, ఇంద్రియములలో మనస్సు ఏవిధముగా శ్రేష్ఠమైనదో, వ్రతములన్నింటిలో ఈ సోమవార వ్రతము శ్రేష్ఠమైనది. ఈ వ్రతమునకు “షోడశ సోమవారవ్రతం” అని పేరు. దీని మహిమలను వర్ణించుట ఆసాధ్యము. భక్తీ పూర్వకముగా దీనిని ఆచరించువారు ఏదేది కోరుకొందురో దానిని వారు శీఘ్రముగా పొందుతారు. ముత్తైదువలు అఖండ సౌభాగ్యమును పొందుతారు. రోగులకు సంపూర్ణారోగ్యము కలుగును, ఎడబాసిన భార్యాభర్తలు ఒకరినొకరు చేరుకొందురు. ఈవిధముగా ఇది పరమ మహిమాన్వితమైన వ్రతము అని చెప్పెను.

        అంతట పార్వతి “స్వామీ! దయచేసి ఈ వ్రతమును ఆచరించు విధానమును అనుగ్రహింపుడు” అని ప్రార్ధించెను.

        “ప్రియా! ఇది భక్తి పూర్వకముగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతము నాచరించుటకు ఆషాడ మాసపు పౌర్ణమి నుండి కార్తీక మాసపు పౌర్ణమి వరకు వచ్చు నాలుగు నెలలు (చతుర్మాసములు) ప్రాశస్తమైనవి. ఆ రోజులలో వచ్చు పదహారు సోమవారములలో ఈ వ్రతము శ్రేష్టమైనది. సోమవారమునాడు ఉపవాసం ఉండాలి. (ప్రసాదం స్వీకరించుటలో తప్పులేదు) ప్రాతః కాలముననే స్నానాది నిత్యకర్మలను ముగించుకొనవలెను. పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకొనవలెను. వెండి ఇత్తడి వంటి శ్రేష్టమైన లోహములతో చేసిన లింగమును కూడా ఉపయోగించ వచ్చును. బిల్వపత్రములు, పుష్పములు, దూపదీపాదులను, సిద్ధము చేసికొనవలెను. నైవేద్యము కొరకు గోధుమ నూకను వేపి ముద్దచేసి, దానికి కావసినంత నెయ్యి, బెల్లము కలిపి,  ఉండలను చేయవలెను. ఈ వ్రతము కావలసిన ప్రసాద మీదే. ప్రసాదమును శివునకు నైవేద్యము పెట్టి, దానిని మూడు భాగములుగా చేయవలెను. భక్తుల కొకటి, పశువులకొకటి, ఈ వ్రతమును ఆచరించువారికి మూడవది పంచవలెను. ఆ రోజు ఉప్పు తినరాదు. ఇదే విధముగా పదహారు సోమవారాలు శ్రద్ధా భక్తులతో ఆచరించవలెను. 17వ సోమవారమున ఉద్యాపన చెయ్యవలెను. పదహారు సోమవారములందును, పూజించిన మట్టి లింగములను పదహేడవ సోమవారమునాడు జలము నందు వదిలివేయవలెను. ఆ రోజున బ్రాహ్మణులకు అన్నాదనము యథాశక్తి చేయవలెను. ఈ విధముగా వ్రత విధానమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. అది విని పార్వతి “స్వామీ! ఈ వ్రత విధానము చెప్పి అనుగ్రహించితిరి. దీని ఎవరెవరు ఆచరించి ఎటువంటి ఫలములను పొందగలిగిరో వివరముగా తెలుపవలెను” అని ప్రార్థించెను. అంత శివుడు వ్రత పూజాఫలమును చెప్ప నారంభించెను.

        “పార్వతీ! చాలా కాలం క్రితం ఈ వ్రతమును ఆచరించుట వలన నీవే నన్ను భర్తగా పొందితివి. గిరిజా కళ్యాణ సంఘటన ఇంకను నాకు జ్ఞాపకము ఉన్నది. నీను నీకు పతికావలెను అను ఉద్ధేశముతో నీవు ఘోరారణ్యములో తీవ్రమైన తపస్సు చేసితివి. అప్పుడు దేవతలు, సప్తఋషులు నావద్దకు వచ్చి ప్రభూ! నిన్నే నమ్మి తపస్సు చేయుచున్న హైమవతిని అనుగ్రహించ రాదా? ఆలస్యమెందులకు?” అని ప్రార్థించిరి. నేను బ్రహ్మచారి రూపంలో వచ్చి నిన్ను పరీక్షించితిని. నిన్ను సంబోధిస్తూ శివునకున్న అవలక్షణములన్నింటిని వర్ణిస్తూ “శివుడు విరూపి, అపవిత్రుడు, మొరటు వ్యక్తిని అతని నీవు వేరెవారిని నైనను వివాహ మాడరాదా?” అని పరిహసించితిని. అంతట నీకు పట్టరాని కోపం వచ్చెను. కోపంలో కన్నులు ఎర్రబడి “శివనింద మహాపాపం, శివుడు లేనిచో నేను బ్రతుకలేను, వేరొకరిని కన్నెత్తి కూడా చూడను” అన్న నీ దృడ నిశ్చయాన్ని ఖచ్చితంగా తెలిపితివి. అప్పుడు నేను నా నిజస్వరూపంతో నీముందు ప్రత్యక్షమయ్యాను. నీవు పదహారు సోమవారాల వ్రతమాచరించుటచే నీ కోరిక తీరినది. గిరిజా కళ్యాణం అతి వైభవముగా దేవఋషుల గంధర్వుల సమ్ముఖంలో జరిగినది. ఈ విధముగా వ్రతాచరణ వలన నేను నీకు పతినైతిని” అన్నాడు పరమేశ్వరుడు.

also read  Shodasha Ganapathi | షోడశ గణపతి

parvathi-devi-16-somavarala-vratham

        అంతట పార్వతి కూడా సంతుష్టురాలై “స్వామి! నాకునూ జ్ఞప్తికున్నది. అయిననూ ఆ వ్రత మహిమ మీ ముఖతః లోకానికి అందించడానికే అడిగాను. నావలె వేరెవరు ఈ వ్రతము నాచరించి పుణ్య ఫలమును పొందిరో చెప్పవలె” నని ప్రార్థించెను. సదాశివుడు ఇతర సంఘటనలను చెప్ప నారభించేను.

 

సీమంతిని – చంద్రాంగదుల కథ

       “చాలా కాలం క్రితం భరతఖండములో పుణ్యాత్ముడైన చిత్రవర్మ అనే రాజుండెను. ఆయనకు పుత్రులు అనేకులు ఉండిరి. పుత్రిక కొరకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధింపాగా ఆడపిల్ల జన్మించెను. సర్వగుణ సంపన్నురాలైన ఆ శిశువునకు పద్నాల్గవ సంవత్సరమున వైధవ్యము ఖచ్చితముగా ప్రాప్తించును. అని జ్యోతిష్కులు తెలిపిరి. అంతట రాజు దుఃఖితుడయ్యెను. శోకంతో పీడింపబడుతున్న రాజునకు జ్యోతిష్కులు దీనికి పరిహారం తెలిపిరి.

        రాజకుమార్తె అయిన సీమంతిని పూర్ణచంద్రుని వలె పెరుగుచుండును. యుక్త వయస్సు వచ్చిన తరువాత ఆమెను రాజకుమారుడైన చంద్రాంగదున కిచ్చి చిత్రవర్మ వివాహం చేసెను. ఇల్లరికము వచ్చిన అల్లునితో రాజుకు కాలము సంతోషముగా గడుచుచుండెను. ఇట్లుండగా ఒక రోజున చంద్రాంగదుడు జలక్రీడ కోరి యమునానది కేగెను. దురదృష్ట వశమున నది యందలి సుడి గుండంలో చిక్కుకుపోయెను. రాజు పరివారమునకు ఎనలేని దుఃఖము కలిగెను. సీమంతిని కూడా సహగమనమునకు సిద్ధపడెను. అంతట యజ్ఞవల్క్య మహాముని భార్యయైన మైత్రేయి అచటకు వచ్చి, “పుత్రీ! చింతించవలదు. నేను నీకొక వ్రతమును ఉపదేశించెదను. దానివలన వైధవ్యము నుండి నీకు నివృత్తి కలుగగలదు.” అని చెప్పి పదహారు సోమవారాల వ్రతము ఉపదేశించెను.

        మైత్య్రి ఉపదేశించిన ప్రకారము చెప్పినది చెప్పినట్లుగా సీమంతిని కూడా భక్తితో వ్రతమును ఆచరించెను. నాగలోకమునకు చేరిన చంద్రాంగదుడు నాగరాజుచే సన్మానింపబడి సురక్షితంగా రాజధానికి మరలివచ్చెను. అందరూ సంతోషించి ఈ విధంగా ఎడబాసిన పతీ పత్నులు వ్రత మహిమచే మరలా ఒకటయ్యారు.”

 

మార్కండేయ – సాంబ, పూజారి కథ

        మహాతపస్వి యైన మృకండునకు సంతాన ప్రాప్తి కలుగక పోగా ఆటను తపస్సు చేసి సదాశివుని పుత్ర భాగ్యము కొరకు ప్రార్ధించెను. శివుడు ప్రత్యక్షమై “మహర్షి! నీకు పదహారు సంవత్సరముల అయువుగల సజ్జనుడైన కుమారుడు కావలెనా? నూరు సంవత్సరములు ఆయువుగల అత్యధమ పుత్రుడు కావలయునా?” అని ప్రశ్నించెను. ఋషి “నాకు పదహారు సంవత్సరముల అయువుగల సత్పుత్రుడు చాలు” అనెను. శివుని అనుగ్రహంతో మార్కండేయుడు అనే సత్పుత్రుడు జన్మించెను. ఆయువు మిగియచుండగా అతను భక్తితో పదహారు సోమవారాల వ్రతమును ఆచరించి శివుని కృపకు పాతుడై చిరంజీవి అయ్యెను.

Bhaktha-Markandeya

        ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు శమంతకమణిని అపహరించెనన్న అపవాదు వచ్చెను. దాని నివారణ కొరకై అతను జాంబవంతుని పై విజయము సాధించి, మణిని సంపాదించి, జాంబవతిని పరిణయమాడెను. సంతానము లేనందున ఆమె పదహారు సోమవారాల వ్రతము ఆచరించగా సంతాన ప్రాప్తి కలిగెను. బిడ్డకు సాంబ అని పేరు పెట్టిరి.

        శివపార్వతులు భూలోకమున సంచరించుచు, ఒక సారి వైశ్యుడు – వైశ్యుని భార్య – రూపమునందు దేవాలయమున ప్రవేశించి పాచికలు ఆడ నారంభించిరి. అందు శివునకు అపజయము కలిగెను. “వైశ్యుడే గెలిచె” నని పూజారి అసత్యము పలికెను. పార్వతికి కోపము కలిగెను. అసత్యము పలికిన అర్చకుని తత్ క్షణమే కుష్టురోగి కమ్మని శపించెను. అర్చకుడు వికృత రూపుడయ్యెను. “శివ, శంకరా” అని అరుస్తూ అతను క్రింద పడిపోయాడు. అంతట సుందరియైన ఒక వనిత ప్రత్యక్షమై “పదహారు సోమవారముల వ్రతమున ఆచరించుము. దీనివలన నీ రోగము నయమగును” అని పలికెను. అర్చకుడు అలాగే చేశాడు. అతని వికృతి రూపం తొలగిపోయింది. పదహారు సోమవారముల వ్రతాచరణ ఫలంగా అతనికి కుష్టునివారణ మయ్యెను. అనంతరము శివుని కృపవలన శివ సాన్నిధ్యమును పొందెను. మార్కండేయ పూరాణమునందు చెప్పబడిన శివపార్వతి సంవాద రూపము నున్న పదహారు సోమవారాల వ్రతకథ సంపూర్ణం.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular