Tuesday, October 15, 2024
Homeపర్యాటకం8 Ways to Reach Tirumala by Walk | తిరుమలకు ఉన్న ఎనిమిది నడకదారులు

8 Ways to Reach Tirumala by Walk | తిరుమలకు ఉన్న ఎనిమిది నడకదారులు

 

8 Ways to Reach Tirumala by Walk : కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి ప్రస్తుతం మనం చాలా సౌకర్యవంతంగా వెల్లగలుగుతున్నాము. కానీ

  • ఎటువంటి సౌకర్యాలు లేని కాలంలో భక్తులు ఎలా వెళ్లేవాళ్లు?
  • తిరుమల చేరుకోవడానికి ఎన్ని మార్గాలు ఉండేవి?

     సాధారణంగా మనకు తెలిసినంత వరకు అలిపిరి మెట్ల మార్గం ఒకటి, రెండోది శ్రీవారి మెట్టు మార్గం. ప్రస్తుతం అలిపిరి మరియు శ్రీవారి మెట్ల మార్గం మాత్రమే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా Tirumala చేరుకోవడానికి రెండు ఘాట్ రోడ్లు ఉన్నాయి. అప్పుడప్పుడు కడప జిల్లా వాసులు గుంపులు గుంపులుగా మామండూరు ప్రాంతం నుంచి నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు.

     హిందువులు దర్శించే పుణ్యక్షేత్రాలలో అతి మహిమ గలది కలియుగ వైకుంఠం అయిన తిరుమల. ప్రతి హిందువూ జన్మలో ఒక్కసారైనా Tirumala దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. భక్తులు రోడుమార్గం లేదా మెట్లమార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు.

     అసలు తిరుమలకు ఎన్ని మార్గాలు ఉండేవి ఆ మార్గాలేవి అనే విషయం ఈ కథనం ద్వారా తెల్సుకుందాం.

     శ్రీవారి ఆలయానికి చేరుకోవటానికి మొత్తం 8 దారులు ఉన్నాయి. వాటిలో మొదటిది మరియు ప్రధానమైనది అలిపిరి.

Tirumala ఆదిపడి లేదా అలిపిరి

     క్రీ.శ. 1387లో మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లు నిర్మించారు. క్రీ.శ. 1550లో విజయనగర సామంతులు అలిపిరి-గాలి గోపురం మార్గం నిర్మించారు. మొదటి నుండి అలిపిరి దారే ప్రధాన దారిగా గుర్తింపు పొందింది.

     ఆదిపడి కాలక్రమంలో అలిపిరి అయింది. ఆదిపడి అంటే మొదటి మెట్టు అని అర్థం. ఈ మార్గంలో Tirumala చేరుకోవాలంటే పన్నెండు కిలోమీటర్లు (12 km) నడవాలి.

     అలిపిరి నుండి మెట్ల దారి ఏర్పాటు చేయకముందు కపిల తీర్థం నుండి గాలిగోపురం వరకు నడకదారి ఉండేది. క్రీ.శ. 1550లో విజయనగరరాజ్య సామంతుడైన మాటల అనంతరాజు అలిపిరి నుండి గాలిగోపురం వరకు మెట్ల మార్గం నిర్మించాడు (శాసనాల ఆధారంగా). మెట్ల మార్గం నిర్మించాక కూడా కొంతకాలం వరకు కపిలతీర్థంపై ఉండే దారిలో కూడా తిరుమలకు చేరుకునేవారు. మోకాళ్ళ పర్వతం దగ్గర మెట్లను క్రీ.శ 1387లో ఏర్పాటు చేశారు (శాసనాల ఆధారంగా).

     అలిపిరి మెట్ల మార్గంలో బయలుదేరుతూనే మాలదాసరి విగ్రహం సాష్టాంగ నమస్కారంతో కన్పిస్తుంది రెండు అడుగులు వేయగానే పాదాల మండపం, శ్రీ లక్ష్మీనారాయనస్వామి ఆలయం, పడి మెట్లు ఎక్కగానే పిడుగుపడి పునర్ నిర్మింపబడిన పెద్ద గోపురం, అక్కడి నుండి ముందుకు వెళ్తూనే కుమ్మరి దాసుని సారె కనిపిస్తుంది. అక్కడి నుండి ముందుకు వెళ్తూనే గజేంద్ర మోక్షం, చిట్టెక్కుడు, పెద్దక్కుడు, గాలిగోపురం వస్తుంది.

     అలిపిరి దారిలో వచ్చే ఎత్తైన గాలిగోపురాన్ని క్రీ.శ 1628లో నిర్మించారు. గాలి గోపురం లోపలికి వెళ్తూనే మహంతులు పూజించిన సీతారామలక్ష్మణుల ఆలయం వస్తుంది. అక్కడే పెద్ద ఆంజనేయస్వామి ముకుళిత హస్తాలతో ఉన్న విగ్రహం ఉంది. అటు నుంచి దక్షిణం వైపు అడవిలోకి వెళ్తూ గంటా మండపం, నామాలగవిలను చేరుకోవచ్చు. అవ్వాచారి కోననుండి వెళ్తుంటే అక్కగార్ల గుడి వస్తుంది. ఆ తర్వాత మోకాళ్ళ పర్వతం వస్తుంది. అక్కడే రామానుజాచార్యుల వారి గుడి వుంది.

     మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడ నుంచి ముందుకు వెళితే శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వతుంది. అటు నుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే Tirumala శ్రీవారి ఆలయం వస్తుంది.

     అలిపిరి మార్గంలో మొత్తం 3550 మెట్లు (11- 12 km) ఉన్నాయి. సుమారు మూడు నుండి నాలుగు గంటలలో కొండను చేరుకుంటారు. ప్రస్తుతం పెద్ద ఎత్తున జనం వినియోగిస్తున్న దారి ఇదే.

Tirumala-by-walk-tp-01

శ్రీవారి మెట్టు

     తిరుపతికి పది కిలోమీటర్ల (10 km) దూరంలో శ్రీనివాసమంగాపురం ఉంది. అక్కడి నుండి ఐదు కిలోమీటర్ల (5 km) దూరంలో శీవారి మెట్లు ఉంది. ఈ దారి నుండి మూడు కిలోమీటర్లు (3 km) నడిస్తే Tirumala వస్తుంది. ఈ మెట్ల దారిన నడిస్తే ఒక గంటలో తిరుమల చేరుకోవచ్చు.

also read  Tirumala Brahmotsavam | తిరుమల బ్రహ్మోత్సవాలు

     చంద్రగిరి దుర్గం నిర్మించిన తరువాత ఈ దారికి ప్రాముఖ్యం లభించింది. చంద్రగిరికి ఎనిమిది కిలోమీటర్ల (8 km) దూరంలో శీవారి మెట్టుంది చంద్రగిరి రాజులూ ఈ దారిలోనే తిరుమలకు వెళ్ళేవారు. అలిపిరి కన్నా తక్కువ సమయంలో కొండకు వెళ్ళగలిగే శ్రీవారి మెట్టు అయితే ఈ దారి గుండా యాత్రికులు వెళ్ళలేకపోతున్నారు, కారణం శ్రీవారి మెట్టుకు సరైన ప్రయాణ సౌకర్యాలు లేకపోవడమే.

     శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారి దర్శంనం కోసం వచ్చినప్పుడు చంద్రగిరిలో విడిది చేసేవారు. ఆయన శ్రీవారి మెట్టు దారిలోనే ఏడు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే దారిలో అప్పటి నుంచి నేటివరకు కూరగాయలు, పాలు, పెరుగు ఈ దారిలోనే ఎక్కువగా తీసుకువెళ్తుంటారు. ఈ మార్గంలో మొత్తం 2388 మెట్లు (3 – 4 km) ఉన్నాయి. సుమారు  రెండు గంటలలో కొండను చేరుకోవచ్చు.

Tirumala-by-walk-tp-02

మామండూరు అడవి

     ఒకప్పుడు బాగా రద్దీగా ఉండే నడకదారి మామండూరు దారి. పూర్వం కడప, రాజంపేట, కోడూరుల మీదుగా వచ్చే భక్తులకు మామండూరు దారి ఎంతో అనుకూలంగా ఉండేది.

     విజయనగర రాజుల కాలంలో కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల వారు ఈ మార్గం ద్వారానే Tirumala చేరుకునేవారు. మామండూరు దారిలో నడిచే యాత్రికుల కోసం విజయనగర రాజులు మెట్ల మార్గం ఏర్పాటు చేశారు.

     మామండూరు నుండి బయలుదేరితే ఉత్తరాన కరివేపాకు కోన వస్తుంది. ఆ తర్వాత పాల సత్రం వస్తుంది. ఇంకొంచెం దూరం పొతే ఈతకాయల మండపం తరువాత పడమర వైపు కొంత దూరం వెళ్తే తిరిరుమలలోని గోగర్భ డ్యాం వస్తుంది.

     1940లో తిరుమలకు ఘాట్ రోడ్డు నిర్మించలని అనుకున్నప్పుడు మామండూరు దారే సులువైన దారి అని ఆనాటి ఇంజనీర్లు చెప్పారు. తిరుమలకు ఘాట్ రోడ్లు నిర్మించాలని అనుకున్నప్పుడు ఇంజనీర్లు సర్వే చేసి మూడు దారులను ఎంపిక చేశారు. అలిపిరి నుండి తూర్పు వైపుకు వెళ్ళే మొదటి ఘాట్ రోడ్డు, పడమటి దిక్కు నుండి చంద్రగిరి వైపు వెళ్ళే రెండో ఘాట్ రోడ్డుతో పాటు మామండూరు దారిలో మరో ఘాట్ రోడ్డును నిర్మించాలని ప్లాన్ చేశారు. అప్పటి టిటిడి బోర్డు సభ్యుడు రాఘవాచార్యులు మామండూరు ఘాట్ రోడ్డు ప్రతిపాదనను ఒప్పుకోలేదు.

    Tirumala నుండి మామండూరు వెళ్ళే నడక మార్గంలో పాలసత్రం నుండి దక్షిణం వైపు వెళ్తే కాకులకొండ వస్తుంది. ఈ కాకులకొండ మీదుగా వెళ్తే మామండూరుకి చేరుకోవచ్చు. ఇప్పటికీ అప్పుడప్పుడు రాజంపేట ప్రాంతవాసులు ఈ దారిలో తిరుమల చేరుకుంటారు.

Tirumala-by-walk-tp-03

కుక్కలదొడ్డి నుంచి తుంబుర తీర్థం, పాపవినాశనం మీదుగా

     కడప జిల్లా సరిహద్దులోని చిత్తూరు జిల్లాకు చెందిన కుక్కల దొడ్డి నుండి తుంబురు తీర్థం నుండి పాపవినాశానానికి, అక్కడి నుండి తిరుమలకు దారి వుంది. దీన్ని తుంబుర తీర్థం అంటారు.

     పాపవినాశనండ్యాం నీళ్ళు లోయలో ప్రవహిస్తూ తుంబురు తీర్థం మీదుగా కుక్కలదొడ్డి వైపు ప్రవహిస్తాయి. కుక్కలదొడ్డి నుండి సెలయేటి గట్టు మీదుగా ఎగుడుదిగుడులు లేకుండా నడిచి వస్తే తుంబుర తీర్థం వస్తుంది. తుంబురలోయను నిట్టనిలువుగా అధిరోహించి కొంత దూరం కొండపైన నడిచి వస్తే పాపవినాశనం వస్తుంది.

     పాపవినాశనం నుండి తుంబుర తీర్థానికి పన్నెండు కిలోమీటర్ల (12 km) దూరం ఉంటుంది. పాపవినాశనం నుండి తిరుమలకు సులభంగా రోడ్డు మార్గాన చేరుకోవచ్చు.

Tirumala-by-walk-tp-04

కళ్యాణి డ్యామ్

          కళ్యాణి డ్యామ్ కి అనుకుని ఉన్న శ్యామల కోన దారిలో పదిహేను కిలోమీటర్ల (15 km) దూరం ప్రయాణిస్తే తిరుమల నారాయణగిరి వస్తుంది. అదే దారిలో ఇరవైఎనిమిది కిలోమీటర్లు (28 km) ప్రయాణిస్తే ఒకగంటలో భక్తులు Tirumala చేరుకోగలరు.

Tirumala-by-walk-tp-05

రేణిగుంట నుంచి అవ్వచారి కోన దారి

     ఈ అవ్వాచారి కొండ మొదటి ఘాట్ రోడ్డులో అక్కగార్ల గుడి ముందు మోకాలి పర్వతం కింద ఉంది. రేణిగుంట సమీపంలో తిరుపతి కడప రహదారిలో ఆంజనేయపురం ఉంది. ఇక్కడి నుండి అవ్వాచారి కోన అడుగు భాగంలో నడిచి పడమర వైపుకి వెళ్తే మోకాళ్ళ పర్వతం వస్తుంది. ఇక్కడే రామానుజాచార్యుల వారి ఆలయం వుంది.

     మోకాళ్ళ మిట్ట చేరుకున్నాక పక్కనే సారె పెట్టెలను చూడొచ్చు. అక్కడనుంచి ముందుకు వెళితే లక్ష్మీనరసింహస్వామి ఆలయం వస్తుంది. మెట్లు దిగుతూనే అవ్వాచారి ఆలయం వస్తుంది. అటు నుండి నడుచుకుంటూ అనేక మండపాల గుండా వెళ్తే Tirumala శ్రీవారి ఆలయం వస్తుంది.

also read  Tirumala Theerthalu | తిరుమల తీర్థాలు

 

Tirumala-by-walk-tp-06

ఏనుగుల దారి

     ఇవే కాక ఏనుగుల దారి కూడా ఒకటి ఉంది. చంద్రగిరి పక్కన ఉండే శ్రీవారి మెట్ట మార్గం  నుండి అవ్వాచారి కోన వరకూ ఒక దారి ఉండేది. ఒకప్పుడు తిరుమలలో నిర్మించిన అందమైన మండపాలకు రాతి స్తంభాలను ఈ దారి నుండే ఎనుగుల ద్వారా చేరవేసేవారు. కాబట్టి దీనికి ఏనుగుల దారి అనే పేరు వచ్చిందంటారు. ఇప్పుడు ఈ దారిని ఎర్రచందనం స్మగ్లర్లు వాడుతున్నారు.

Tirumala-by-walk-tp-07

తలకోన నుంచి

     తలకోన నుండి కూడా తిరుమలకు మరో దారుంది. ఈ దారి తలకోన జలపాతం దగ్గర నుండి జండాపేటు దారిలో వస్తే తిరుమల వస్తుంది. ఈ దారి పొడవు దాదాపు ఇరవై కిలోమీటర్లు (20 km) ఉంటుంది.

    Tirumala కొండకు తల భాగంలో ఈ కోన ఉంది కాబట్టి దీనికి తలకోన అని పేరు వచ్చింది. నెరభైలు, ఎర్రావారిపాలెం భక్తులు ఈ దారిలోనే అప్పుడప్పుడు తిరుమలకు వస్తుంటారు.

Tirumala-by-walk-tp-08

     అపట్లో శ్రీకాళహస్తి నుండి కరకంబాడి, చెన్నాయిగుంట, మంగళం, అక్కారంపల్లి, కపిలతీర్థం వరకు ఒక మార్గం ఉండేది. అదే విధంగా శ్రీకాళహస్తి నుండి తొండమానుడు, గుడిమల్లం నీలిసాని పేట, గాజులమండ్యం, కల్లూరు, అత్తూరు, పుత్తూరుల గుండా నారాయణవరం, నాగాలపురానికి మరోకదారి వుండేది. ఆరోజుల్లో తిరుపతి తొండమండలంలో ఒక భాగం. నారాయణవరం ఆకాశరాజు కాలంలో రాజధాని. ఇక్కడే కళ్యాణ వేంకటేశ్వరుని గుడి ఉంది.

     నాగులాపురంలో వేదనారాయణస్వామి ఆలయం ఉంది. ఆ రోజుల్లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఒకదానికి ఒకటి అనుసంధానం చేసిన దారులు ఉండేవి.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular