Friday, September 6, 2024
Homeఆధ్యాత్మికంVinayaka Chavithi Vratha Katha | వినాయక చవితి వ్రత కథ

Vinayaka Chavithi Vratha Katha | వినాయక చవితి వ్రత కథ

 

Vinayaka Chavithi Vratha Katha : వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి, కథ పూర్తయిన తరవాత వాటిని శిరసుపై వేసుకోవాలి

 

Vinayaka Chavithi Vratha Katha గణపతి జననము

     గజముఖుడయిన అసురుడొకడు తన తపస్సుచే శంకరుని మెప్పించి, తనను ఎవరూ వధించజాలని శక్తిని, శివుడు తన ఉదరమునందే నివసించవలెనని కోరికనూ కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతడి కుక్షి యందు బందీ అయినాడు, అతడు అజేయుడైనాడు భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీ దేవికి చాలా దుఃఖహేతువైనది, జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతయగు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువు నర్థించినది, విష్ణువు గంగిరెద్దువాని వేషము ధరించినాడు. నందీశ్వరుని గంగిరెద్దుగా వెంట తీసుకొని వెళ్లి, గంగిరెద్దునాడించి గజముఖాసురుని మెప్పించాడు. గజముఖాసురుడు ఆనందంతో “ఏమి కావలయునో కోరుకో” అన్నాడు విష్ణుదేవుని వ్యూహము ఫలించినది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు శివుని నందీశ్వరుని వశము చేయుమన్నాడు. గజముఖాసురునికి శ్రీహరి వ్యూహమర్థమయింది తనకు అంత్యకాలము దాపురించినదని గుర్తించాడు. అయినా మాట తప్పుట కుదరదు కుక్షియందున్న శివుని ఉద్దేశించి “ప్రభూ శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగియుచున్నది నా యనంతరం నా శిరస్సు త్రిలోకపూజితమగునట్లు, నా చర్మమును నిరంతరము నీవు ధరించునట్లు అనుగ్రహించవలసింది” అని ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశము చేశాడు. నందీశ్వరుడు అసురుడి యుదరమును చీల్చి శివునికి అందుండి విముక్తి కల్గించాడు. శివుడు గజముఖాసురుని శిరమును, చర్మమును తీసుకొని స్వస్థానోన్ముఖుడైనాడు.

     అక్కడ పార్వతి భర్త రాక గురించి విని పరమానందముతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహమందున్నది. స్నానాలంకారముల ప్రయత్నములో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసినది. అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది దానికీ ప్రాణప్రతిష్ఠ చేయవలెననిపించినది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియగు పర్వత రాజు ద్వారా గణేశ మంత్రమును పొందినది, ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేసినది ఆ దివ్యసుందర బాలుని వాకిటనుంచి, తన పనులకై లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు, వాకిట ఉన్న బాలుడు అతనిని అభ్యంతరమందిరము లోనికి పోనివ్వక నిలువరించాడు. తన మందిరమున తనకే అటకాయింపా! శివుడు రౌద్రముతో ఆ బాలుని శిరచ్ఛేదము చేసి లోనికేగినాడు.

Vinayaka-Chavithi-Vratha-Katha-tp-01
                                                                                    పసుపు గణపతి

     జరిగిన దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజముఖాసురుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమునకు శాశ్వతత్వమును, త్రిలోకపూజనీయతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టియైనాడు.

గణేశుడు అగ్రపూజనీయుడు

     ఒకసారి, శివుని కుమారుడైన కుమారస్వామి, గాణాధిపత్యము తనకు ఈయమని కోరినాడు. శివుడు పుత్రులిద్దరికీ పోటీ పెట్టినాడు “మీలో ఎవరు ముల్లోకములలోని పవిత్రనదీ స్నానాలు చేసి ముందుగా నావద్దకు వచ్చెదరో వారికి ఈ ఆధిపత్యము లభిస్తుందన్నాడు. కుమారస్వామి వేగముగా సులువుగా సాగి వెళ్ళినాడు. గజాననుడు త్రిలోకముల పవిత్ర నదీ స్నాన ఫలదాయకమగు నారాయణ మంత్రం జపించి, తన తల్లితండ్రులచుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణం చేసినాడు. నారములు అనగా జలములు, జలమున్నియు నారాయణుని ఆధీనాలు అనగా ఆ మంత్ర ఆధీనములు, మంత్ర ప్రభావము చేత ప్రతీ తీర్థస్నానమందును కుమార స్వామి కన్నాముందే వినాయకుడు  ప్రత్యక్షము కాజొచ్చాడు వినాయకునికే ఆధిపత్యము లభించినది.

చంద్రుని పరిహాసం

     గణేశుడు జ్ఞానస్వరూపి, అగ్రపూజనీయుడు, జగద్వంద్యుడూ ఈ విషయమును విస్మరించిన ఒకనాడు కైలాసమున కుబ్జ రూపములో విహరించుచున్న గణేశుని చూచి చంద్రుడు ఆ వింతరూపమునకు విరగబడి నవ్వాడు. “నిన్ను చూచిన వారు నీలాపనిందల పాలగుదురు గాక” అని గణపతి చంద్రుని శపించాడు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుని చూడకుండుటెట్లు? నీలాపనిందల మధ్య సవ్యముగా సాగుట ఎట్లు? చంద్రుడు జరిగిన పొరపాటుకు పాశ్చాత్తాపము చెందాడు. లోకులును ఈ శాపము నుండి విముక్తికై గణపతిదేవుని అర్థించారు. కరుణామయుడగు ఆ దేవుడు విముక్తికై ఉపాయము సూచించాడు. బాధ్రపద శుద్ధ చవితినాడు తన పూజచేసి తన కథను చెప్పుకొని అక్షతలు శిరమున ధరించిన యెడల నిష్కళంక జీవితములు సాధ్యమగునని అనుగ్రహించాడు.

also read  16 Somavarala Vratham Pooja Vidhanam | 16 సోమవారాల వ్రతం, పూజ విధానం
Vinayaka-Chavithi-Vratha-Katha-tp-02
                                                                           చంద్రుని పరిహాసం

     ఇది ఎల్లరికి విధి. దీనిలో ఏమరుపాటు ఎంతటివారికి అయినా తగదని శ్యమంతకోపాఖ్యానము ద్వారా మరింత స్పష్టము చేయబడింది.

శ్యమంతకోపాఖ్యానము:

    ఒకానొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణపరమాత్మ పాలలో చంద్రబింబమును చూచుట సంభవించంది. దాని దుష్ఫలితము ఆయనకు తప్పలేదు. సత్రాజిత్తు అను నాతడు సూర్యోపాసనచే శ్యమంతకమను మణిని సంపాదించాడు. దినమునకు ఎనిమిది బారువుల బంగారము నీయగల మణియది. అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదగినదని ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు భావించాడు. ఆ విషయము సత్రాజిత్తునకు సూచించాడు. అతనికి ఆ సూచన రుచించలేదు.

        అనంతరము సత్రాజిత్తు తమ్ముడగు ప్రసేనుడు విలాసముగా ఆ మణిని ధరించి వేటకై అడవికి వెళ్ళినాడు. ఆ మణిని చూచి మాంసఖండమని భ్రమించిన సింహ మొకటి అతడిని వెంటాడి చంపి మణిని నోటకరచుకొని పోయింది.

        నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రలోభముతో శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేసాడు. ఆ నింద బాపుకొనుట శ్రీకృష్ణునికి ఆవశ్యకమైనది.

        అడవిలో అన్వేషణ సాగించాడు. ఒకచోట ప్రసేనుని కళేబరము కనిపించింది. అచట కనిపించిన సింహపు కాలిజాడల వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము, భల్లూకం పోరాడిన జాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు భల్లూకపు కాలిజాడల వెంట వెళ్ళాడు. అవి ఒక గుహలోకి వెళ్ళాయి. గుహలో ఒక బాలునికి ఉన్న ఊయల తొట్టికి మణి వేలాడగట్టబడి ఉంది. శ్రీకృష్ణుడు ఆ మణిని అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక భల్లూకం అతనిపై బడింది. భీకర సమరం సాగింది ఒక దినము కాదు, రెండు దినములు కాదు, ఇరువది ఎనిమిది దినములు. క్రమంగా ఆ భల్లూకమునకు శక్తిక్షీణించజోచ్చింది.

         అది సామాన్య భల్లూకము కాదు. మహాభక్తుడు శక్తివంతుడైన జాంబవంతుడు. రామాయణ కాలమునాటి ఆ జాంబవంతుడు కర్మబంధములు విడివడక నిలిచియున్నాడు. అజేయుడాతడు. ఎవరి వల్లను అతడు క్షీణబలుడగు ప్రశ్నేలేదు. ఒక్క శ్రీరామచంద్రుని వల్లనే అది సాధ్యము. ఈ విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రునితోనేనని గుర్తించి స్తోత్రము చేయనారంభించాడు.

         అది త్రేతాయుగపు గాథ. ఇది ద్వాపరయుగము. ఆ యవతాములో జాంబవంతుని సేవలకు మెచ్చిన శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకొమ్మనగా అవివేకముతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రునితో ద్వంద్వ యుద్ధమును కోరినాడు. అది శ్రీరామకార్యము గాదు కాన అప్పుడు నెరవేరలేదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతునకు దీర్ఘకాల కర్మబంధమయినది. ఇప్పుడు కర్మపరిపక్వమయినది. నేడీ రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటిల్లినది. అవివేకము వైదొలగినది. అహంభావము నశించింది. శారీరము శిథిలమయింది. జీవితేచ్ఛ నశించింది. శ్రీకృష్ణపరమాత్మ రూపమున తనను అనుగ్రహించ వచ్చినది ఆ శ్రీరామచంద్ర ప్రభువేనని గ్రహించి ప్రణమిల్లి ఆ మణిని, ఆ మణితో పాటు తన కుమార్తె జాంబవతిని అప్పగించి కర్మబంధ విముక్తి పోదాడు జాంబవంతుడు.

Vinayaka-Chavithi-Vratha-Katha-tp-03
                                                                              శంతకమణి

     శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరమునకు వెళ్ళి పురజనులకు జరిగిన యదార్థమును వివరించి నిందబాపుకున్నాడు. నిజము తెలిసిన సత్రాజిత్తు కూడా పశ్చాత్తాపము చెంది మణిని తన కుమార్తెయగు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహము చేశాడు. ధర్మజ్ఞుడగు శ్రీకృష్ణుడు మణిని నిరాకరించి సత్యభామను స్వీకరించాడు.

         వినాయక వ్రతము చేయక చంద్రబింబమును చూచుట వలన జరుగు విపరీతమును స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణపరమాత్మ లోకుల యెడల పరమదయాళువై బాధ్రపద శుద్ధ చవితినాడు వినాయకుని యథాశక్తి పూజించి ఈ శ్యమంతకమణి కథను అనగా అందలి హితబోధను చెప్పుకొని, గణేశతత్వము పట్ల భక్తి వినయములతో శిరమున అక్షింతలు ధరించిన యెడల నాడు చంద్రదర్శనము చేసినను నిష్కారణ నిందా భయముండదని లోకులకు వరం ఇచ్చాడు. అది మొదలు మనకు శ్యమంతకమణి గాథను వినుట సాంప్రదాయమయినది.

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular