Sri Rama Navami Recipes: హిందువులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. Sri Rama Navami Recipes ఇక్కడ ఇవ్వడం జరిగింది.
Sri Rama Navami Recipes:
హిందువులు జరుపుకొనే ప్రతి పండుగకీ ఒక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది. దాంతో పాటుగా ఆ సమయాలలో ఉండే వాతావరణం, లభించే వనరులు, వచ్చే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని వివిధ సంప్రదాయాలను మన పూర్వీకులు నిర్ణయించారు. వినాయకచవితి నాడు పత్రిపూజ, దీపావళి నాడు బాణాసంచా, ఉగాది నాడు వేపపచ్చడి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి పండుగకీ కాలానుగుణమైన ఓ సంప్రదాయం కలిగి ఉంటుంది. అదేవిధంగా శ్రీరామనవమి రోజు పానంకం ఎంతో మేలు చేస్తుంది !
శ్రీరామనవమి మండువేసవిలో వస్తుంది. ఈ సమయానికి ఎండలే కాదు, వడగాల్పులు మొదలవుతాయి. ఎండాకాలంలో బెల్లం పానకం రోజు తాగడం వలన శరీరానికి చాలా మంచిది. ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వలన శరీరంలో ఉండే ఖనిజాలు (పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సోడియం) చెమట రూపంలో బయటికి వెళ్లే ప్రమాదం ఉంది. బెల్లం పానకంలో ఈ నాలుగు ఖనిజాలూ ఉంటాయి. ఈ పానకం తాగడం వలన తిరిగి ఈ ఖనిజాలను పొందవచ్చు. ఎండ తాపాన్ని తట్టుకునే శక్తిని బెల్లంలో ఉండే ఇనుము ఇస్తుంది. అంతేకాదు, వేసవిలో తగ్గుతూ పెరుగుతూ ఉండే రక్తపోటుని కూడా బెల్లంలో ఉండే ఖనిజాలు అదుపులో ఉంచుతాయి.
ఆయుర్వేదం ప్రకారం చూసినా పానకం వల్ల లాభాలెన్నో ఉన్నాయి. వేసవిలో ఎండ తాపానికి పిత్తదోషాలు పెరుగుతాయి. దీని కారణంగా అజీర్ణం, గుండెల్లో మంట, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపిస్తాయి. బెల్లానికి ఈ దోషాలను నివారించే గుణం ఉంది. బెల్లానికి ఉన్న మరో లక్షణం చలవ చేయడం.
బెల్లం పానకంలో మిరియాలు, యాలుకలు కూడా వేస్తారు. మిరియాలు, యాలుకలు కూడా జీర్ణశక్తిని పెంచుతాయి. శరీరంలోని మలినాలన్నీ బయటకు వెళ్లే దానికి ఉపయోగపడతాయి. ఎండాకాలంలో వచ్చే పొడిదగ్గులకు మిరియాలు మంచి ఔషధంగా పనిచేస్తుంది, యాలుకలు నోటి దుర్వాసనను తగ్గిస్తుంది.
తర్వాత వడపప్పు గురించి చెప్పాలంటే, పెసరప్పుకి చలవ చేసే గుణం ఉంది. అంతేకాదు! అతి సులభంగా జీర్ణమయ్యే పదార్థాలలో పెసరపప్పు ఒకటి. శరీరంలోని మలినాలను తొలగించేందుకు, బరువు తగ్గే దానికి ఇప్పడు చాలా దేశాలలో పెసరపప్పుతో చేసిన సూప్ తాగుతున్నారు.
ఈ పానకం తయారు చేయడం చాలా సులభం. శాస్త్రీయ పద్ధతిలో పానకం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పానకం ప్రసాదంగానే కాదు ఎండాకాలంలో రోజూ తాగితే ఎండ తాపాన్ని, వడదెబ్బ నుండి కాపాడుతుంది.
Sri Rama Navami Recipes పానకం
కావలసిన పదార్థాలు
బెల్లం – 1 కప్పు, మిరియాల పొడి – 1 టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, శొంఠిపొడి – 1 టీ స్పూన్, నిమ్మరసం – 1 టీ స్పూన్, నీళ్లు – 3 కప్పులు, యాలకాయలు – 5, లేత తులసి ఆకులు – 10, పచ్చకర్పూరం – చిటికెడు.
తయారీ విధానం
ముందుగా బెల్లాన్ని మెత్తగా దంచి పెట్టాలి, గిన్నెలో నీళ్లు పోసి అందులో దంచి పెట్టుకున్న బెల్లం వేయాలి. ఇందులో, శొంఠి పొడి, దంచిన యాలకలు, కొద్దిగా ఉప్పు వేసి, బెల్లం నీటిలో కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి. తర్వాత పచ్చకర్పూరం, మిరియాలపొడి వేయాలి. కొన్ని తులసి ఆకులను వేయాలి. చివర్లో నిమ్మరసం వేసి బాగా కలిపితే పానకం సిద్ధమైనట్లే.
టిప్స్
- పానకం లో ఉప్పు, పచ్చ కర్పూరం వేసి వేయనట్లు ఉండాలి అప్పుడే రుచి బాగుంటుంది.
- లేత తులసి ఆకులు అయితేనే పానకం బాగుంటుంది, లేకపోతే తులసి ఆకులను తరిగి వేసుకోవాలి.
వడపప్పు
కావలసిన పదార్థాలు
పెసరపప్పు – ఒక కప్పు, పచ్చిమిర్చి – ఒకటి (సన్నని తరుగు), పచ్చికొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు, మామిడికాయ ముక్కలు – పావు కప్పు, కీరా తరుగు – 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత.
తయారీ విధానం
పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. నానబెట్టిన పప్పులో నీళ్లు వంపేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నవి, పచ్చికొబ్బరి తిరుము, చిన్న చిన్న మామిడికాయ ముక్కలు, కీరా తరుగు, తరిగిన కొత్తిమీర వేసి కలపాలి. చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపితే వడపప్పు తయారు అవుతుంది.
చలిమిడి
కావలసిన పదార్థాలు
రాత్రంతా నానబెట్టిన బియ్యం – కప్పు, పంచదార పొడి – ముప్పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అరటీస్పూను, పాలు – మూడు టేబుల్ స్పూన్లు, నెయ్యి – టేబుల్ స్పూను.
తయారీ విధానం:
తడి బియ్యాన్ని వడగట్టుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. బియ్యపిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, చక్కర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలపాలి. అంతే చలిమిడి రెడీ.
పానకం, వడపప్పు, చలిమిడిని స్వామివారికి నివేదన చేసి భక్తులకు పంచాలి.