Friday, July 19, 2024
Homeఆధ్యాత్మికంవ్రతాలుSankshtahara Chaturthi Vratha Katha | సంకష్టహర చతుర్థి వ్రత కథ

Sankshtahara Chaturthi Vratha Katha | సంకష్టహర చతుర్థి వ్రత కథ

Sankshtahara Chaturthi Vratha Katha :  ప్రతి మాసం సంకష్ట హర చతుర్థి రోజు ఈ వ్రతం చేసి స్వామివారిని అర్చించి స్తుతించి, ఈ కథను చదువుకొనినవారు ధన్యులు. కావున మనము అందరమును యధాశక్తిగ ఈ  వ్రతం ఆచరించి గణపతి ఆశీర్వాదం మరియు అనుగ్రహమును పొందెదము గాక.

 

Sankshtahara Chaturthi Vratha Katha

ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి, ఆయన ప్రసన్నుడయ్యాకా ఇలా కోరారు. “స్వామీ కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి, తత్ఫలితముగా ఋణ బాధలు, సంతానలేమి, గృహ వసతి లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కవలసినంత ధనం లేకుండుట, శతృపీడ, పనులలో ఆటంకాలూ, అభివృద్ధి లేకపోవుట, పాడిపంటల సరిగ్గా పండకపోవుట, వివాహం కాకపోవుట, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చేయని తప్పుకి రాజ దండన అనుభవించుట” మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టములు తీర్చు వ్రతమేదైనా సెలవీయండి అని స్కందుని అడిగారు.

అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై “వ్రతాలలోకెల్లా అత్యంత శక్తిమంతమైన సంకష్టహరచతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి, శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకూ ఫలితమందక బాధపడుచూ, తన పూర్వపు అవతారాలలో తనయందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతమది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుని పతిగా పొందినది.

ఇప్పుడు ఆ వ్రత విధానం చెప్తాను వినండి “ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా, బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలొనూ మంగళ వారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్థీ తిథి ఉన్న రోజు చూసుకొని, ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర మేల్కొని, కాల కృత్యాలు తీర్చుకొని, నల్లటినువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి, సంధ్యావందనం మొదలైన నిత్య నైమిత్తికాలు ఆచరించి, సంకష్టహర చతుర్థి వ్రతం చేస్తానని మొక్కుకొని, ఎరుపు రవికెల బట్టను గణపతి ముందుంచి దానిలో ఒక చిటికెడు పసుపూ కుంకుమ వేసి, మూడు దోసిళ్ళ బియ్యాన్ని అందులో పోసి, ఎండుఖర్జూరాలు, రెండు వక్కలు, దక్షిణతో గూడిన తాంబూలము అందులో వుంచాలి. మనసులో వున్న కోరికను స్వామికి తెలిపి ముడుపు మూట కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చెయ్యాలి. ఉదయమంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా వుండాలి. మనసులో గణపతి నామ స్మరణ చేస్తుండాలి.

సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి దీపం వెలిగించి, శ్రీ సంకష్ట హర చతుర్జి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి, కుడుములూ చేసి స్వామికి నివేదించాలి. వ్రతమూ అర్ఘ్యాలూ అయిన పిదప అతిధులని గణేశ స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజూ ఆ రోజూ బ్రహ్మ చర్యాన్ని పాటించి, దైవ నామ స్మరణతో, లౌకిక విషయాలమీదకి మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే కోరికలు శీఘ్రముగా నెరవేరుతాయి. 12 సార్లు చేసే ఈ వ్రతానికి వ్రత సిధ్ధి కలుగుతుంది. మరునాడు గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం.

 

భృశుండి మహర్షి వృత్తాంతం

ఒకనాడు ఆకాశ మండలంలో పయనిస్తూన్న నారద మహర్షికి, కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా? అని చూసాడు అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతడి పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపించారు. వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూన్న మహర్షి వద్దకు వెళ్ళి, “ఓ మహర్షీ! నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకములో దారుణ బాధలకు గురవుతున్నారు. అదేమీ పట్టనట్టు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారం చేయి” అని చెప్పి వెళ్లిపోయాడు.

నారదుడి మాటలు విన్న భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకొచ్చింది. వారి సహకారం వల్లే తాను ఈనాడు తపస్వినయ్యాను. ఎలాగైనా వారి బాధల్ని రూపు మాపాలని సంకల్పించాడు. తన ఇష్ట దైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకుని గతంలో సంకష్టహర గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తనవారికి ధారపోయాలని అనుకొని, ఓ గణనాధా! నేనే గనుక నీ దివ్యచతుర్దీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో చేసి వుంటే, నా పితరులు, వారితోపాటు నా భార్య, కుమార్త నరకలోక బాధల నుంచి నిముక్తి పొందుదురు గాక! అని నీళ్ళు విడిచి పెట్టాడు. గజాననుడీ అనుగ్రహముతో అయన చేసిన వ్రతాలల్లో, ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే, ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాల్ని ధరించి, దివ్యవిమానం ఎక్కి గణేశ లోకానికి చేరుకున్నారు.

also read  Shiva Ashtottara Shatanamavali | శివ అష్టోత్తరశతనామావళి

ఇక ప్రతీ మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో చెప్ప తరమా?

 

వేశ్య వృత్తాంతం

ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించ సాగాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు. అపుడు ఇంద్రుడు, “ఓ రాజా! మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది” అని చెప్పాడు. అపుడు ఆ రాజు అయ్యా! మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరు తుంది అని అడిగాడు వినయంగా!

అపుడు ఇంద్రుడు “ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున సాయంత్రం వరకూ ఎవరైతే ఉపవాసం. చేసి సంకష్ట హర గణేశ వ్రతం చేసారో, వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది” అని చెప్పాడు. సైనికులంతా కలిసి రాజ్యం అంతా అన్వేషిస్తూ, ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం, వ్రతం చేసిన వారు కనబడకపోదురా? అని తిరిగారు. కానీ దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు.

అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్ళటం కనబడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెని ఎందుకు గణేష లోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు. దానికి గణేశ దూత, “ఈమె నిన్నంతా ఉపవాసం వుంది. తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం అయిన తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ది వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితికి చేరుస్తుంది. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ లోకానికి (స్వనంద లోకానికి) చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు ” అని చెప్పాడు.

అపుడు సైనికులు, ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేశుని దూతని ఎంతో బ్రతిమాలారు. అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పారు. ఆమె పుణ్య ఫలాన్ని వారికివ్వటానికి గణేశుని దూత అంగీకరించనే లేదు. ఈ లోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుని విమానం వెంటనే బయలుదేరింది.

తెలీక చేసినా ఆ వ్రతం ఎంతటి ఫలితాన్నిస్తుందో చెప్పే వృత్తాంతం ఇది.

 

కృతవీర్యుని కథ

పూర్వం కృతవీర్యుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహా పతివ్రత, సుగుణవతి, ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్యదంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్రసంతానం కోసం వారు చేయని వ్రతం లేదు, దానం లేదు ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా, ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తను మంత్రులకి రాజ్య భారాన్ని అప్పగించి భార్యతో కల్సి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి, కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది.

ఒకనాడు ఆకాశమార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలి పడి పితృలోకానికి వెళ్ళి వెళ్ళి కృతవీర్యుడి తండ్రిని కలిసాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధ పడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి ” ప్రభూ! నా కుమారుడు సకల సద్గుణ వంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాల్ని, వ్రతాల్ని చేసినవాడు ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకునే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్రసంతానము కలగకపోవడానికి కారణము ఏమిటి? అతడు ఏ పాపం చేసాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలిగిపోయి అతడికి సంతానప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి ” అని దీనంగా ప్రార్థించాడు.

also read  Arjuna Kruta Durga Stotram | శ్రీ దుర్గా స్తోత్రం (అర్జున కృతం)

అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీర్యుడి తండ్రితో ఇలా చెప్పాడు. “నీ కుమారుడు పూర్వ జన్మలో సాముడు అనే పేరుగలవాడు. పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి, బ్రహ్మవేత్తలూ సాత్వికులూ అయిన పన్నెండుమంది బ్రాహ్మణుల్ని చంపి వారి దగ్గరున్న సంపదనీ ఆహారాన్నీ దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆరోజు మాఘ బహుళచతుర్ది. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు, తన కుమారుణ్ణి “గణేశా” అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కల్సి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమపాపి అయినప్పటికీ మాఘ బహుళ చవితినాడు ఏమీ తినక పోవటం, సంధ్యాసమయంలో ఇంటికొచ్చి కొడుకుని గణేశా అని పలుమార్లు పిలవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలము గడిచాక భూలోకంలో కృతవీర్యుడనే పేరుతో నీ పుత్రుడుగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గతజన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు.అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది” అని చెప్పాడు.

ఆ మాటలు విన్న కృతవీర్యుడి తండ్రి ఎంతో బాధపడుతూ “పితామహా! నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్ట మైనదైనా సరే!” అని ప్రాధేయపడ్డాడు.

అప్పుడు బ్రహ్మ, “నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైనదీ, కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీగణేశ “సంకష్ట హర చతుర్థీ” వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్పాడు.

అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు. కరడుకట్టిన ప్రారబ్దాన్ని సైతం, కర్పూరంలా కరగించివేసే మహిమాన్వితమైన వ్రతం ఇది.

ఈ కధలు నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియచేస్తున్నాయి. వినాయకుని భక్తు లందరూ ఈ వ్రతం చేయటం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారనీ, నరదృష్టి పడినా ఎట్టి పరిస్థితుల్లోనూ పతనమవ్వరనీ దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు.

శ్రీ గణేశాయ నమః – స్వస్తి

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular