Srimad Bhagavad Gita Chapter 2 – Sankhya Yoga (Verses 1-25) :
అథ ప్రథమోఽధ్యాయః
సాంఖ్య యోగః
Bhagavad Gita : అర్జునుడు శోకంలో మునిగిపోయాడు. శోకానికి తాత్కాలిక కారణం ఏదైనా మూలకారణం అజ్ఞానమే. జీవితాన్ని గురించి, జగత్తు గురించి సమగ్రమైన జ్ఞానం లేనప్పుడు శోకం వస్తుంది. సాంఖ్య – సమ్యక్ ఖ్య; అంటే సమగ్రమైన జ్ఞానం అని అర్థం.
మనకి ఎదుట ఉన్న ప్రపంచమే అగపడుతుండి కాని దానిని చూపించే మన జీవితం యొక్క ప్రాముఖ్యం, ప్రయోజనం తెలియదు, ప్రపంచంలోని విషయ వస్తువులను అనుభవించి ఆనందిచడానికే పుట్టామని అనుకుంటాము గాని, మనం జీవితం ద్వారా ఏమి సాధించాలి అనే ఆలోచన రాదు. ఎలా సాధించాలో అంతకన్నా తెలియదు. ఈ రెండూ మనకి సరిగా తెలిసినప్పుడు శోకం మటుమాయం అవుతుంది. సమగ్రమైన ఈ జ్ఞానాన్ని ఇచ్చేది సాంఖ్యయోగం.
సాంఖ్యయోగం అందించే ఈ జ్ఞానం మీదనే తక్కిన అధ్యాయాలలో బోధింపబడిన సాధనాక్రమమంతా ఆధారపడి ఉన్నది.
సంజయ ఉవాచ।
శ్లో || తం తథా కృపయాఽఽవిష్టం అశ్రుపూర్ణాకులేక్షణమ్ |
విషీదంత మిదం వాక్యం ఉవాచ మధుసూదనః || 1
తా || ఆ ప్రకారంగా కరుణతో ఆవహింపబడి, కన్నీటితో నిండి కలత పడుతున్న చూపులతో, విషాదంలో వున్న అర్జునుణ్ని చూచి మధుసూదనుడిలా అన్నాడు.
శ్రీ భగవానువాచ |
శ్లో || కుతస్త్వా కశ్యల మిదం విషమే సముపస్థితమ్ |
అనార్యజుష్ట మస్వర్గ్యం అకీర్తికర మర్జున || 2
తా || అర్జునా! ఈ విషమస్థితిలో నీకు ఈ మాలిన్యం ఎక్కడ నుండి వచ్చింది? ఇది ఆర్యులకి తగింది కాదు. స్వర్గాన్ని, కీర్తిని రెంటినీ చెడగొట్టుతుంది.
శ్లో || క్లైబ్యం మాస్మగమః పార్థ! నైతత్త్వ య్యుపపద్యతె |
క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప! || 3
తా || ఓఅర్జునా! బలహీనుడివి కావద్దు. ఇది నీకు శోభించదు. శత్రుసంహారకుడా! క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచి, లేచి నిలబడు.
అర్జునఉవాచ |
శ్లో || కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన! |
ఇషుభిః ప్రతియోత్స్యామి పూజార్హా వరిసూదన || 4
తా || మధుసూదనా ! పూజింపదగిన భీష్మ ద్రోణులను ఎదిరించి బాణాలతో ఎలా యుద్ధం చేయగలను?
శ్లో || గురూనహత్వాహి మహానుభావాన్
శ్రేయోభోక్తుం భైక్ష్య మపీహ లోకే |
హత్వాఽర్థ కామాంస్తు గురూని హైవ
భుంజీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ || 5
తా || మహానుభావులైన గురువుల్ని వధించకుండా ఈ లోకంలో బిచ్చమెత్తి అయినా జీవించడమే మేలు, గురువుల్ని వధిస్తే, నెత్తుటితో తడిసిన (హేయ) సంపదలూ, భోగాలూ ఈ లోకంలో మాత్రమే అనుభవిస్తాను (ధర్మమోక్షా లుండవు).
శ్లో || న చైత ద్విద్మః కతరన్నో గరీయః
యద్వా జయేమ యదివానో జయేయుః |
యా నేవ హత్వా న జిజీవిషామః
తేఽ వస్థితాః ప్రముఖే ధార్త రాష్ట్రాః || 6
తా || ఈ రెంటిలో (యుద్ధంచేయకుండా బిచ్చమెత్తుకోవడమో, యుద్ధం చేసి గురువులను చంపడమో ) ఏది మేలో నాకు తెలియడం లేదు. యుద్ధమే చేసినా, మేము గెలుస్తామో, వాళ్ళేగెలుస్తారో (మేమే గెలిచినా) ఎవర్ని చంపాక జీవించడానికి ఇష్టపడమో ఆ ధార్తరాష్ట్రులే ఎదురుగా నిలబడి ఉన్నారు.
శ్లో || కార్పణ్యదోషోపహత స్స్వభావః
పృచ్ఛామిత్వాం ధర్మసంమూఢ చేతాః |
యచ్ఛ్రేయః స్యా న్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేఽహం శాధిమాం త్వాం ప్రపన్నమ్ || 7
తా || కార్పణ్యదోషంవల్ల నా బుద్ధి దెబ్బతిన్నది. ధర్మమేదో తెలియని వాడనై నిన్నడుగుతున్నాను. ఏది నిశ్చితంగా శ్రేయస్కరమో అది తెలియచెయ్యి. నీ శిష్యుణ్ణి, నీ శరణు జొచ్చిన నన్ను నడిపించు.
శ్లో || న హి ప్రపశ్యామి మమాపనుద్యాత్
యచ్ఛోక ముచ్ఛోషణ మింద్రియాణామ్ |
అవాప్య భూమా వసపత్నమృద్ధం
రాజ్యం సురాణామపి చాధిపత్యమ్ || 8
తా || ఇంద్రియాలని దహింపజేసే నాయీ శోకాన్ని తగ్గించేదేదో నేను తెలుసుకో లేకుండా వున్నాను. భూమిలో ఏకచ్ఛత్రాధిపత్యంగాని, దేవలోకాధిపత్యంగని దీనిని తొలగించలేదు.
సంజయఉవాచ |
శ్లో || ఏవ ముక్త్వా హృషీకేశం గుడాకేశః పరంతపః |
న యోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవహ || 9
తా || ఓ రాజా! అర్జునుడు శ్రీ కృష్ణునితో ఈ ప్రకారంగా చెప్పి, యుద్ధం చెయ్యనని గోవిందునితో పలికి, మరి మాటాడకుండా ఊరుకున్నాడు.
శ్లో || తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత |
సేనయో రుభయోర్మధ్యే విషీదంత మిదం వచః || 10
తా || భారతా! రెండు సేనల మధ్య విషాదంలోపడిన అర్జునుడితో హృషీకేశుడు నవ్వుతున్నట్లుగా ఇలా పలికాడు.
ఇక్కడ నుండి గీతోపదేశం ప్రారంభం
శ్రీ భగవానువాచ |
శ్లో || అశోచ్యా నన్వశోచ స్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే |
గతాసూ నగతాసూంశ్చ నానుశోచంతి పండితాః || 11
తా || నీవు విచారింపదగని వారికోసం విచారిస్తున్నావు. ప్రజ్ఞావంతుడివలె మాట్లాడుతున్నావు. చనిపోయిన వారి గురించి గాని, బ్రతికివున్న వారి గురించి గాని పండితులు శోకించరు.
శ్లో || న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః |
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ || 12
తా || నేనుకానీ నీవుకానీ, ఈ రాజులుకానీ లేని సమయం అంటూ భూతకాలంలో లేదు. ఇకముందు కూడా ఎవరూ లేని సమయమంటూ వుండబోదు.
శ్లో || దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా |
తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి || 13
తా || ఈ శరీరంలో దేహధారికి బాల్యం, యౌవనం, వృద్ధాప్యం ఎలా కలుగుతాయో, అలాగే మరో దేహం లభించడం కూడాను. వివేకి ఈ విషయంలో భ్రమపడడు.
శ్లో || మాత్రా స్పర్శాస్తు కౌంతేయ! శీతోష్ణ సుఖదుఃఖదాః |
ఆగమాపాయినోఽనిత్యాః తాం స్తితిక్షస్వ భారత! || 14
తా || కుంతీకుమారా! ఇంద్రియాల ద్వారా వచ్చే స్పర్శలే శీతోష్ణాలనీ, సుఖదుఃఖాలనీ కలిగిస్తాయి. అవి వస్తూ పోతుంటాయి. నిలకడ లేనివి. అర్జునా! వాటిని సహించాలి.
శ్లో || యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ! |
సమ దుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే || 15
తా || పురుషశ్రేష్టుడా! సుఖ దుఃఖాలలో సమంగా వుండే యే ధీరుణ్ణి ఈ ద్వంద్వాలు బాధించవో, అతడు అమృతత్త్వానికి అర్హుడౌతాడు.
శ్లో || నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః |
ఉభయో రపి దృష్టోఽన్తః త్వనయో స్తత్త్వదర్శిభిః || 16
తా || అసత్యమైనవాటికి సత్తాలేదు. సత్యమైనదానికి సత్తా లేకపోవడమంటూ లేదు. ఈ రెండింటి అసలు స్వరూపము తత్త్వజ్ఞులచేత దర్శింపబడినది.
శ్లో || అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ |
వినాశ మవ్యయస్యాస్య న కశ్చిత్కర్తు మర్హతి || 17
తా || దేనిచేత ఈ ప్రపంచం వ్యాపించబడి వున్నదో, ఆ సత్తు వినాశరహితమైనదని తెలుసుకో. నాశరహితమైన దానిని ఎవరూ నాశనం చేయలేరు.
శ్లో || అంతవంత ఇమే దేహాః నిత్యస్యోక్తా శ్శరీరిణః |
అనాశినోఽప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత! || 18
తా || నిత్యమైన, నాశరహితమైన, పరిమితులు లేని శరీరధారియగు ఆత్మకు ఇవి అంతమయ్యే దేహాలు. అందుచేత అర్జునుడా! యుద్ధము చేయి.
శ్లో || య ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతమ్ |
ఉభౌ తౌ న విజానీతః నాయం హన్తి న హన్యతే ||19
తా || ఆత్మచంపుతాడని కానీ, చంపబడతాడని కానీ (ఈయన చనిపోతాడని) ఎవరను కుంటారో, వారిద్దరూ ఎరుగని వారే. ఆత్మ చంపడు, చంపబడడు. (చంపినా, చచ్చినా శరీరమేకాని శారీరి అయిన ఆత్మకాదు).
శ్లో || న జాయతే మ్రియతే వా కదాచిత్
నాయం భూత్వాభవితా వా న భూయః |
అజో నిత్య శ్సాశ్వతోఽయం పురాణః
న హన్యతే హన్యమానే శరీరే || 20
తా || ఇది ఎప్పుడు పుట్టేది, గిట్టేది కాదు. ఇది ఎప్పుడో తయారై ముందు లేకుండా పోయేది కాదు. పుట్టుకలేనిదై, నిత్యమూ, శాశ్వతమూ, పురాతనమూ అగు ఈ ఆత్మ శరీరం చంపబడినా కూడా చంపబడదు.
శ్లో || వేదా వినాశినం నిత్యం య ఏన మజ మవ్యయమ్ |
కథం స పురుషః పార్థ! కం ఘాతయతి హన్తికమ్ || 21
తా || జన్మరహితము, నాశరహితము, అవ్యయము అయిన దీనిని (ఆత్మను) ఎవరు ఎరుగునో ఆ పురుషుడు యెలా యెవరిని చంపిస్తాడు? ఎవరిని చంపుతాడు?
శ్లో || వాసాంసి జీర్ణాని యథా విహాయ
నవాని గృహ్ణాతి నరోఽపరాణి |
తథా శరీరాణి విహాయ జీర్ణాని
అన్యాని సంయాతి నవాని దేహీ || 22
తా || మానవుడు జీర్ణమైన వస్తాలని విసర్జించి క్రొత్తవాటిని ఎలా ధరిస్తాడో, అలాగే దేహధారి (ఆత్మ) జీర్ణమైన శరీరాలని విసర్జించి క్రొత్తవాటిని స్వీకరిస్తాడు.
శ్లో || నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః |
న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః || 23
తా || దీనిని (ఆత్మను) శస్త్రాలు ఛేదించవు. అగ్ని కాల్చదు. నీరు తడపదు. గాలి ఎండించదు.
శ్లో || అచ్ఛేద్యోఽయ మదాహ్యోఽయం అక్లేద్యోఽశోష్య ఏవ చ |
నిత్య స్సర్వగతః స్థాణుః అచలోఽయం సనాతనః || 24
తా || ఇది ఛేదింపరానిది, కాల్చరానిది, తడపరానిది, ఎండించరానిది. నిత్యము, సర్వవ్యాపకము, స్థిరము, అచలమైనది ఇది.
శ్లో || అవ్యక్తోఽయ మచింత్యోఽయం అవికార్యోఽయముచ్యతే |
తస్మాదేవం విదిత్వైనం నానుశోచితు మర్హసి || 25
తా || ఇది వ్యక్తం కానిది, యోచించడానికి వీలులేనిది. వికారాలు లేనిది అని చెప్పబడుతుంది. అందువల్ల దీనిని నీవు ఈ ప్రకారంగా అర్థం చేసుకొని విచారించ కూడదు.