Sapta Shanivara Vratha Katha: ఈ కలియుగమున శనివారవ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివారవ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి, ఈ Sapta Shanivara Vratha Kathaను చదువుకొనినవారు ధన్యులు. కావున మనము అందరమును యధాశక్తిగ శనివారవ్రతమును ఆచరించి శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహమును పొందెదము గాక.
Sapta Shanivara Vratha Katha శ్రీ వేంకటేశ్వర అవతార ఘట్టం
శౌనకాది మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వేంకటేశ అవతార కథ:
కలియుగం మొదలైనది. కలిదోష నివారణం కోసం మహర్షులందరూ నైమిశారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవ్వరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగుమహర్షి ‘యజ్ఞాఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరులలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా’ నన్నాడు. ఆయన మహాతపశ్శాలి, మునులంతా ఆమోదించారు.
ఆయన ముందుగా సత్యలోకం వెళ్ళాడు. బ్రహ్మ అతడి రాకను గమనించక, సరస్వతీ వీణా నాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగుమహర్షికి కోపం వచ్చి ‘మహా తపశ్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టి కర్తనని అహంకరిస్తూన్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవును గాక’ అని శపించాడు.
తరువాత కైలాసానికి వెళ్ళాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగుమహర్షి కోపంతో ‘శంకరా! నీవు నాట్య విలాసాలలో మునిగి, మహాతపశ్శాలిని, అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక, భూలోకంలో నీకు లింగరూపంలోనే కాని నిజరూపంలో ఆరాధన జరగకుండును గాక’ అని శపించినాడు.
ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు. మాధవుడు పానుపు మీద పరుండి, తనకు పాదసేవ చేస్తూన్న లక్ష్మీదేవితో సరససల్లాపాలు ఆడుతున్నాడు. మునిరాకను గమనించ లేదు. భృగువు వెళ్ళి, ‘అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా?’ అంటూ విష్ణుమూర్తి గుండెలమీద తన్నినాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీమహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి ‘మునీంద్రా! మీ రాకచేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి’ అంటూ భృగుమహర్షికి పాదాలోత్తాడు. భృగుమహర్షికి గర్వభంగమైనది. విష్ణుమూర్తికి నమస్కరించి ‘ఓ దేవదేవా! మీవంటి సత్వగుణ సంపన్నులు పదునాలుగు లోకాలలోను లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు. కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మసంరక్షణచేసి, ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి’. అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ‘త్రీమూర్తులలో పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు’ అని తేల్చి చెప్పినాడు. మునులందరూ సత్ర యాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహా విష్ణవుకే ధారపోసినారు.
అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. శ్రీహరి వక్షస్థలమే తన నివాసం. ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నినాడు. అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినాడు. భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది. లక్ష్మీ లేని యిల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి ‘దేవా! కలియుగంలో పాపం పెరిగింది. పాప భారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు’ అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రికొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు.
శేషాద్రి పర్వతప్రాంతాలను పరిపాలిస్తూన్న మహారాజు ఆకాశరాజు. అతడు సంతానం లేక పుత్రకామేష్టి చెయ్యబోతూ భూమిని దున్నుతూండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరచి చూడగా మహాలక్ష్మీ కళతో ఒక బాలిక కనిపించింది. ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచాడు. యుక్తవయస్సు వచ్చిన పద్మావతి ఒకసారి, శ్రీనివాసుని చూచి మోహించింది. తల్లిదండ్రులకు చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూచి శ్రీనివాసుని తేజోవిశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తరువాత అతడి తమ్ముడు తొండమానుడు రాజైనాడు.
శ్రీనివాసుడు వేంకటేశ్వరుడను నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతీ భూదేవులతో నివసించసాగినాడు. తొండమానుడు శ్రీ వేంకటేశునికి ఆలయం నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షంలాంటివాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలచి ఉన్నాడు.
శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని, ‘వేంకటాచలంపై వెలిశాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే, వారి కథను వినిపించ’ మని సూతిని అడిగారు. సూతుడు ఇలా చెప్పాడు.
కుమ్మరి భీము కథ
తిరుపతి మహాక్షేత్రమునకు సమీపమున నొక పల్లెలో భీముడు అను కుమ్మరి వాడొకడు కలడు. అతడు పేదవాడు, కుండలను తయారు చేసి వాటిని అమ్ముకొని జీవించెడివాడు. అతనికి శ్రీనివాసుని పై భక్తి ఎక్కువ. చిరకాలము దేవుని పూజింపవలయును అని యున్నను కుటుంబం పరిస్థితిని బట్టి వానికి అట్టి అవకాశముండెడిదికాదు. అందువలన తాను కుండలను తయారు చేయు ప్రదేశమున శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమనుంచుకొనెను. సారేపై కుండలను తయారుచేయునప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పముగ చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద నుంచు చుండెడివాడు. అది వానికి నిత్య కృత్యమయ్యెను.
also read : Ekadasi Vratha Kathalu in Telugu | ఏకాదశి వ్రత కథలు
ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వేంకటేశ్వరస్వామి యందు భక్తి కలవాడు. అతడు ప్రతిదినమును వేంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించెడివాడు. కొంత కాలమునకు అతడిలో అహంకారము పొడసూపెను. ఆ పక్క రోజు అతడు పూజ చేయుటకు ఉద్యుక్తుడు కాగా, తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టిపూలు స్వామివారి వద్ద కనిపించినవి కారణము అర్థము కాలేదు. అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలనుంచుచున్నారని యనుమానించెను. తన భటులను కాపలాగా నుంచెను. రాజు యెన్ని విధములుగా యత్నించిననూ బంగారుపూల స్థానమున మట్టిపూవులే స్వామివారి యొద్ద నుండెడివి. మహారాజునకు మానసిక వ్యధ పెగిగెను. చింతాపీడితుడైన వానికి శ్రీ వేంకటేశ్వరస్వామి కలలో కనిపించెను. ‘రాజా! సమీప గ్రామమున భీముడను కుమ్మరియొకడు కలడు. అతడు కుండలు చేయుచున్నను నా స్మరణమును ధ్యానమును విడువని మహాభక్తుడు. వాని భక్తి ప్రభావమున అతడుంచిన మట్టి పూవులు యిచటి నా సన్నిధానమున చేరుచున్నవి. నీవుంచినట్టి బంగారు పూలు అతడుంచిన పూలముందు నిలువలేక అదృశ్యములగుచున్నవి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు. విచారింపకుము’ అని ఊరడించెను.
తనను మించిన భాక్తుడొకడున్నాడని స్వామివారు చెప్పినమాటలు పరిశీలించుటకై వేంకటాచలమునకు సమీపముననున్న పల్లెలలో భటులతో కలసి తిరుగసాగెను. ఒక పల్లెలో సారెపై కుండనుంచి త్రిప్పుచు చేతికి అంటిన మట్టిని పుష్పముగ చేసి సమీపమున నున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీముని చూచి ఆశ్చర్యపడెను.
రాజు భీముని సమీపించి ‘ఓయీ ! నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట యేల? నీకు పూజకు పుష్పములు దొరకుటలేదా?’ అని యడిగెను భీముడు రాజునకు నమస్కరించి ‘మీవంటివారు వచ్చుటచే నా యిల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించుట యొట్టో తెలియనివాడు. దరిద్రుడను కుండలను చేయనిదే నా కుటుంబమునకు గడవదు. కావున నేను ఉదయము నుండి సాయంకాలము వరకు కుండలను చేయక తప్పదు. చెతికి అంటిన మట్టినే పుష్పముగ చెసి యిట్లు స్వామివారికి సమర్పించుకొనుచుంతిని’ అని వివరించెను. కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను. కుమ్మరివాని భక్తికి మెచ్చి వానికి నమస్కరించి తన రాజ్యమునకు పోయెను. ఆ తరువాత కొంత కాలమునకు భీముడు సశరీరంముగా వైకుంఠము చేరెను. శ్రీ వేంకటేశ్వరస్వామి భీముని భక్తికి మెచ్చి యికనుండి నా ఉదయం ప్రసాదము మట్టిపాత్రలో నివేదింపపలయునని తొండమాను మహారాజునకు కలలో కనిపించి చెప్పెను. ఈనాటికిని స్వామివారి సన్నిధిలోయీ ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టికుండలతోనే నివేదన చేసి ఆరాధించుచున్నారు.
తొండమానుడు శ్రద్ధాభక్తులతో శ్రీ వేంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు, రధోత్సవములు సమారాధననలు మున్నగువానిని జరిపించుచు మరుజన్మలో విష్ణులోకమును చేరెను.
శనైశ్చర – శ్రీ వేంకటేశ సంవాదం
ఒకసారి శనైశ్చరునికి, మానవులెవ్వరూ తనని భక్తితో సేవించడం లేదనీ, భయంతో మాత్రమే పూజిస్తున్నారనీ విచారం కలిగింది. అప్పుడు వేంకటేశునికి తపస్సు చేయగా ఆయన సాక్షాత్కరించారు.
‘స్వామీ! నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు. అ భయం పోవడానికి, ఇంక నుంచీ నాకు ప్రీతీ అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆపైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి’ అని కోరినాడు. అందుకు స్వామి చిరునవ్వు నవ్వి, ‘నీ కోరిక సమంజసంగానే వుంది. అసలు నీకూ నాకూ భేదం ఏముంది? ఆరువారాలు దాటాక ఏడవ వారం అంటే ఇష్టపడతావు. నేను ఆరుకొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను. నువ్వు నీల వర్ణుడివి, నేను అ వర్ణుడనే, నువ్వు సప్తమ గ్రహానివి, నేను సప్త గిరీశుడను. సామాన్య మానవులకు ఈ విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడుతున్నారు. నినూ నన్నూ వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి, ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుంచీ వారు విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్యైశ్చర్యాది సకల శ్రేయస్సులనూ పొందుతారు. ఇందులో సంశయమేమీ లేదు’ అని వరమిచ్చాడు.
శౌనకాది మహామునులంతా సూతుడు చెప్పించి విని చాలా ఆనందించి, ‘ఈ సప్త శనివారవ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవ్వరైనా ఉంటే, వారి కథను వినిపించ’ మని అతనిని అడిగారు. సూతుడు చెప్పడం ఆరంభించాడు.
దేవదత్త దంపతుల Sapta Shanivara Vratha Katha
పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడుండేవాడు. అతడు వేదవేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని, వారిద్దరూ అతిథుల్నీ ఆదరిస్తూ గృహస్త ధర్మాన్ని పాటిస్తూండేవారు. వారికి శ్రీ వేంకటేశ్వరస్వామి ఇలవేలుపు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనాననంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి చూసి, జాతకం ప్రకారంగా దేవదత్తునికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయనీ, ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివారవ్రతం చేసి అటు శనైశ్చరుణ్ణీ, ఇటు శ్రీ వేంకటేశ్వరస్వామినీ భక్తిగా ఆరాధించవలసిందనీ చెప్పాడు. ‘అమ్మా! నీవు శ్రద్ద వహించి నీ భర్తను కూడా సప్తశనివారవ్రతం చెయ్యడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా!’ అని హెచ్చరించాడు. సప్తశనివార వ్రత విధానాన్ని బోధించాడు. దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి, ఇంటిలో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మరడపం వేసి, వేంకటేశ్వరస్వామి చిత్రపటం పెట్టి, నైవేద్యానికి కొబ్బరి కాయలూ, అరటిపళ్ళూ, నల్లద్రాక్ష పళ్ళూ, 7చిమ్మిలి ఉండలూ సిద్దం చేసుకుని ఉదయం పూజ చేసి, ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనము పెట్టి ఆపైన వారు భుజించి మొదటిరోజు వ్రతం యధావిదిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా వారు ఏడు శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్దలతో కొనసాగించారు.
ఏడవ శనివారం వ్రతపరిసమాప్తి చేసి, Sapta Shanivara Vratha Kathaను చెప్పుకోని, భోజనం చేసి కొంతసేపు శ్రీ వేంకటేశ్వరస్వామి మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతులు భక్తిశ్రద్దలకు, పూజా విశేషాలకూ ప్రసన్నుడై శ్రీ వేంకటేశ్వరస్వామి మాలినీ దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ‘ఓ పరమసాధ్వీ ! మీ దంపతులిద్దరూ శ్రద్దాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనైశ్చేరదోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్ళు జీవించి ధర్మార్ధ కామమోక్షాలనే నాలుగు పురుషార్దాలూ సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్ధకం చేసుకొండి’ అని దీవించి అదృశ్యుడైనాడు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయనకూడా సంతోషించి భార్యను అభినందించాడు.
ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి, ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్నసంతర్పణ చేసి బ్రహ్మాణాశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకూ యధాశక్తిగా శ్రీ వేంకటేశ్వరస్వామి సేవ చేస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు.
కలౌ శ్రీ వేంకట నాయకః అని పెద్దల సూక్తి. కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామిని మించిన ఆరాధ్యదైవం లేడు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శనిదోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు శౌనకాది మహామునులకు వినిపించాడు.
శ్రీస్వామి వారికి మిక్కలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసి ఈ Sapta Shanivara Vratha Katha ను విన్న వారికి కష్టములు తీరును. గ్రహబాధలు పోవును. సంపదలు భోగములు కలుగును. వారికి వారి కుటుంబమునకు సర్వ శుభములు కలుగును. శనివారవ్రతము నాచరించినవారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివారవ్రతము మానవులకు కల్పవృక్షము వంటిది. శనివారవ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్తుతించి, ఈ కథను చదువుకొనినవారు ధన్యులు. కావున మనము అందరమును యధాశక్తిగ శనివారవ్రతమును ఆచరించి శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహమును పొందెదము గాక.