Friday, November 8, 2024
Homeభగవద్గీతSrimad Bhagavad Gita Dhyana Slokas | శ్రీమద్భగవద్గీత (గీతా ధ్యాన శ్లోకాలు)

Srimad Bhagavad Gita Dhyana Slokas | శ్రీమద్భగవద్గీత (గీతా ధ్యాన శ్లోకాలు)

Srimad Bhagavad Gita : భగవద్గీత ఉపనిషత్సారం. భరతం పంచమవేదం. భగద్గీతని నేర్పుగా భారతకథలోకి చొప్పించి, అది సామాన్య మానవుడికి ఎక్కడ, ఏ విధంగా తోడ్పడుతుందో నిరూపించారు వ్యాసమహర్షి.

    సామాన్య మానవుడు పూర్తిగా బాహ్యప్రపంచలో మునిగిపోయి ఉక్కిరిబిక్కి రవుతూంటాడు. అతడు అందులోంచి బయట పడి గట్టెక్కి తరించడానికి భగవద్గీత పద్దెనిమిది మెట్లు చూపుతుంది. ఒక్కొక్క మెట్టు అతడిని భగవంతుడికి చేరువుగా తీసుకువస్తుంది. కాబట్టి ప్రతి అధ్యాయాన్ని యోగమన్నారు.

    అద్యయనం అంటే చదువుకోవడం. ముందు శ్లోకాలని తప్పులు లేకుండా సరిగా పారాయణ చేయడం రావాలి. దాని తరువాత ధీ శక్తిని వినియోగించి, లోతుగా మననం చేసి, పూర్తిగా అర్థం చేసుకోవాలి. అప్పుడే అధ్యయనం మనల్ని ప్రభావితం చేస్తుంది. ఆ తరువాత అధి+అయనం అంటే ప్రపంచ పరిమితులను అధిగమించి అనంతంలో లీనమయ్యే వరకు జీవుని సాధన జన్మజన్మల వరకు సాగుతూనే ఉంటుంది.

    కొందరు పూర్వజన్మలలో కొద్దో గొప్పో సాధన చేసివుండవచ్చు. కొందరు బాగా దూరం వరకు వచ్చివుండవచ్చు. మరికొందరు బాగా పరిపక్వదశకి చేరుకొని వుండవచ్చును. వాళ్ళందరూ ఈ పద్ధెనిమిది మెట్లూ ఎక్కవలసిన అవసరం లేదు. ఏ ఒక్క అధ్యాయాన్నో ఊతగా చేసుకుని నేరుగా భగవంతుణ్ణి చేరుకోవచ్చును. వారి వారి పరిపక్వతలని బట్టి భగవద్గీత వల్ల వేరు వేరు ప్రయోజనాలు పొందవచ్చును. సాధించవచ్చును కూడా. ఈ విషయం భారతం ద్వారా స్పష్టమౌతుంది.

    భగవద్గీతని అప్పటికప్పుడే విన్నవాళ్ళు అయిదుగురున్నారు. స్వార్థంతో గుడ్డివాడైన ధృతరాష్ట్రుడు, కర్మరంగంలో పరిణతి పొందిన అర్జునుడు, సాకార నిష్ఠలో ఇష్టదైవాన్ని దర్శించిన ఆంజనేయుడు, దివ్య దృష్టితో తెలుసుకున్న సంజయుడు, సర్వాన్ని ఎరిగిన వ్యాసుడు.

    తమోగుణంలో మునిగివున్న ధృతరాష్ట్రుడికి భగవద్గీత విన్నందువల్ల తన మమకారానికి, వ్యమోహానికీ కారణమైన కొడుకులూ, రాజ్యమూ రెండూ వదిలిపోయాయి. ధర్మాచరణతోరజోగుణాన్ని శుద్ధపరచుకొన్న అర్జునుడికి భగవద్గీత వల్ల స్వస్వరూపాన్ని గురించిన అజ్ఞానంతొలగిపోయి, ధర్మయుద్ధాన్ని గెలిచాడు. సాత్త్విక జ్ఞానంతో సాకారదైవ దర్శనం చేసుకున్న ఆంజనేయుడు భగవద్గీతను వింటూనే నిరాకార తత్త్వంలో కలిసి పోయాడు. తన్ను తాను జయించుకొన్న సంజయుడు భగవద్గీతని విని ధృతరాష్ట్రుని వంటి గుడ్డివాళ్ళకు బోధచెయ్యడానికి ఉపయోగించుకున్నాడు. మహర్షి అయిన వ్యాసుడు భగవద్గీత యొక్క అమూల్య సందేశాన్ని మహాభారతంలో పదిలపరిచి భావితరాల వారికి అందించాడు. భగవద్గీత మానవులకి ఆశాదీపం, సాధకులకి కల్పవృక్షం.

Srimad Bhagavad Gita : భారతం కేవలం చరిత్రాత్మకమైన ఒక కథ కాదు. దేవుడు జీవుడైన చరిత్ర. చేయరాని పనులు చేసి అగచాట్లు పడే జీవుని చరిత్ర. తాను సృజించు కొన్న విషమ వాతావరణం నుండి వెలువడడానికి వెతలుపడే చరిత్ర. బయటపడే సమయం వచ్చేసరికి భయంతో, మమకారంతో విషాదంలో పడే చరిత్ర. భగవద్గీతా సందేశాన్ని అందుకొని విషాదంలో నుండి, వ్యామోహంలో నుండి విడుదలై, పతనావస్థ నుండి ఉత్థానం చెంది తిరిగి  దేవుడైన చరిత్ర. భారతం యొక్క సందేశసారం భగవద్గీత. భగవద్గీత యొక్క కార్యాచరణ రూపం భారతం. భారతమణిమాలలో భగవద్గీత అందమైన పచ్చల పతకం.

 

Srimad Bhagavad Gita ధ్యాన శ్లోకాలు

 

శ్లో ||  ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
        వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యేమహాభారతమ్ |
        అద్యైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
        అంబ! త్వా మనుసందధామి భగవద్గీతే! భవద్వేషిణీమ్ || 1

తా || భగవంతుడైన నారాయణునిచేత స్వయముగా పార్థునికి బోధింపబడి, పురాణముని వ్యాసునిచేత మహాభారతమధ్యంలో కూర్చబడి, అద్వైతమనే వర్షాన్ని కురిపిస్తూ, భవద్వేషిణివి అయి, పద్ధెనిమిది ఆధ్యాయాలతో కూడిన భగవతివి. భగవద్గీతా మాతా! నిన్ను నేను నిత్యమూ అనుసంధానం చేస్తాను.

 

శ్లో ||  నమోఽస్తు తే వ్యాస! విశాలబుద్ధే!
        ఫుల్లారవిందాయత పత్రనేత్ర! |
       యేన త్వయా భారతతైలపూర్ణః
       ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః  || 2

తా || విచ్చుకున్న తామరపూరేకులవంటి నేత్రాలతో, విశాల హృదయుడవైన ఓవ్యాసమహర్షీ, నీకు నమస్కారం. భారతమనే నూనెతో జ్ఞానమయమైన దీపం నీచేత వెలిగింపబడింది.

 

శ్లో || ప్రపన్న పారిజాతాయ తోత్రవేత్రైక పాణయే |
       జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృత దుహే నమః || 3

తా || ఆర్తులై శరణువేడినవారి పాలిట పారిజాతమై, ఒక చేతిలో బెత్తాన్ని పట్టుకొని,జ్ఞానముద్రుడై, గీతామృతాన్ని పిదికిన కృష్ణునికి నమస్కారం.

 

శ్లో || సర్వోపనిషదో గావః దోగ్ధా గోపాలనందనః |
       పార్థో వత్సః సుధీ ర్భోక్తా   దుగ్ధం గీతామృతం మహత్ || 4

తా || ఉపనిషత్తులన్నీ గోవులుకాగా, పార్థుణ్ణి వత్సంగా చేసుకొని విజ్ఞులు ఆస్వాదించడం కోసం మహత్పూర్ణమైన గీతామృతాన్ని పిదికిన వాడు గోపాలనందనుడు.

also read  Srimad Bhagavad Gita Chapter 2 – Sankhya Yoga (Verses 1-25) | శ్రీమద్భగవద్గీత – సాంఖ్య యోగము (శ్లోకాలు 1-25)

 

శ్లో || వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనమ్  |
       దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ || 5

తా || వసుదేవసుతుడైన దేవునికి, కంసచాణూరులను మర్దించిన వానికి, దేవికికి పరమానందం కలిగించే వానికి, జగద్గురువు కృష్ణునికి నేను నమస్కరించు చున్నాను.

 

శ్లో ||  భీష్మద్రోణ తటా జయద్రథజలా గాంధార నీలోత్పలా
        శల్యగ్రాహవతీ  కృపేణ వహనీ కర్ణేన వేలాకులా   |
        అశ్వత్థామ వికర్ణ ఘోరమకరా  దుర్యోధనా వర్తినీ
        సో త్తీర్ణా ఖలు పాండవై రణనదీ కైవర్తకః కేశవః   || 6

 తా || భీష్మద్రోణులు రెండు తటాలుగా, సైంధవుడు నీరుగా, శకుని నల్ల కలువలుగా, శల్యుడు తిమింగిలంగా, కృపుడు ప్రవాహంగా, కర్ణుడు అల్లకల్లోలంచేసే అలలుగా, అశ్వత్థామ వికర్ణులు ఘోరమైన మొసళ్ళుగా, దుర్యోధనుడు సుడిగుండాలుగా నిండియున్న ఆ రణనది పాండవుల చేత దాటబడినది గదా! కేశవుడే పడవ నడిపినవాడు.

 

శ్లో ||  పారాశర్య వచ స్సరోజమమలం గీతార్థ గంధోత్కటం
        నానాఖ్యానక కేసరం హరికథా సంబోధనా బోధితమ్ |
        లోకే సజ్జన షట్పదై రహ రహః పేపీయమానం ముదా
        భూయాద్భారత పంకజం కలిమల ప్రధ్వంసి నః శ్రేయ సే  || 7

తా || పరాశరకుమారుని వాక్కు అనే స్వచ్ఛమైన సరస్సు నుండి జనించి, గీతార్థాలనే సువాసనలతో నిండి, అనేకమైన ఆఖ్యానాలనే కేసరాలు కలిగి, హరి కథలని వివరించేబోధలతో ఉన్నట్టి, లోకంలో సజ్జనులనే తుమ్మెదల చేత దినదినమూ ఆనందంతో ఆస్వాదింపబడే భారతపద్మం మా శ్రేయస్సు కోసం కలి దోషాన్ని పరిహరించును గాక!

 

శ్లో ||  మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిమ్ |
        యత్యృపా తమహం వందే పరమానంద మాధవమ్ || 8

తా || ఎవరికృప మూగవాణ్ణి మాటకారిగా, కుంటివాణ్ణి గిరి లంఘించే వానిగా చేస్తుందో, అట్టి ఆనంద స్వరూపుడైన మాధవునికి నమస్కరించుతాను.

 

శ్లో || యం బ్రహ్మావరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యై స్తవైః
       వేదైస్సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః  |
       ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః
       యస్యాంతం న విదు స్సురా సురగణాః దేవాయ తస్మై నమః || 9

తా || ఎవరిని బ్రహ్మ, వరుణ, ఇంద్ర, రుద్ర, మరుత్తులు దివ్య స్త్రోత్రాలతో స్తుతించుతారో, ఎవరిని సామగాయకులు షడంగ, పద, క్రమ, ఉపనిషత్తులలో కూడిన వేదాలతో స్తుతించుతారో, ఎవరిని యోగులు ధ్యానస్థితమైన మనస్సు ద్వారా దర్శించుతారో, దేవరాక్షాస గణాలు ఎవరిని క్షుణ్ణంగా తెలుసుకోలేరో, అట్టి దేవునికి నా నమస్కారం.  

Pencil Team
Pencil Teamhttp://telugupencil.com
Hello Friends, I am Jai M Raja, Author & Founder of Telugu Pencil blog and share all the information related to Spirituality, Puja Method, Education, Biographies, Bhagavad Gita, Technology and Business through this Website. I request you to keep supporting us like this, and we will keep providing further information for you. :)
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular